Feb 21,2023 22:18

ప్రజాశక్తి - ఏలూరు
         శ్రీశ్రీ తన రచనలతో సమాజంపై ఎనలేని ప్రభావం చూపించారని సాంస్కృతిక రంగం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం అన్నారు. రెడ్‌బుక్‌ డే సందర్బంగా మంగళవారం సాయంత్రం సిఐటియు జిల్లా కార్యాలయంలో సాహితీ స్రవంతి నేత కె.రామాంజనేయులు అధ్యక్షతన శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తక పఠనం నిర్వహించారు. ముఖ్యఅతిథి సీతారాం మాట్లాడుతూ ప్రపంచంలో కారల్‌మార్క్స్‌, ఎంగెల్స్‌లు రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక అనే చిన్న పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావం చూపిందన్నారు. ఆ ప్రభావంతో ఆయా భాషల్లో అనేక మంది రచయితలు, కవులు గొప్పగొప్ప రచనలు చేశారన్నారు. ఆ కోవలోకే తెలుగులో శ్రీశ్రీ వస్తారన్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం తెలుగు సమాజంపై చాలా పెద్ద ప్రభావం చూపిందన్నారు. శ్రీ శ్రీ విప్లవ రచయితతోపాటు ప్రముఖ సినిమా కవి కూడా అని గుర్తు చేశారు. తెలుగు, తమిళంలో విడుదలైన ఆకలి రాజ్యం సినిమా అంతా శ్రీ శ్రీ రచించిన కవితలే కనిపిస్తాయన్నారు. అంతర్జాతీయ తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా సీతారాం తదితరులు గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహరావు, హేలాపురి బాలోత్సవం నిర్వహణ కమిటీ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, ఐద్వా జిల్లా కన్వీనర్‌ పి.హైమావతి, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌.సుందరయ్య, ఐలు నేత కట్టా సత్యనారాయణ, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు విజిఎంఆర్‌.కృష్ణారావు పాల్గొన్నారు.
ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యురాలు పి.కస్తూరిబారు తెలిపారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రెడ్‌ బుక్‌ డే సందర్భంగా స్థానిక అశోక్‌నగర్‌లోని కెపిడిటి స్కూల్లో మాట్లాడారు కస్తూరిబాయి మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం పాకిస్తాన్‌ ఉర్దూను మాతృభాషగా ఎంపిక చేసుకోగా బంగ్లాదేశ్‌ మాత్రం బెంగాలీని మాతృభాషగా ఎంపిక చేసుకుందని 1951లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచదేశాలు నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు పి.ఆదిశేషు మాట్లాడుతూ ఫిబ్రవరి 21న అంతర్జాతీయంగా పుస్తకప్రియులు రెడ్‌బుక్‌ డే గా నిర్ణయించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ రచించిన మహాకావ్యం మహాప్రస్థానంలోని జయభేరి కవితలోని 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిద నొక్కటి ఆహుతిచ్చాను.. నేను సైతం విశ్వసృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను' అను కవితను పఠనం చేశారు. ముందుగా కెపిడిటి హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ప్రేమ్‌చంద్‌ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రెడ్‌బుక్‌ డే గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకంపై బహిరంగ అధ్యయన వేదిక నిర్వహించారు. మంగళవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో రెడ్‌బుక్‌ డే కార్యక్రమాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.జీవరత్నం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి మాట్లాడుతూ మానవుడే నా దేశం మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ అని అన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నేతలు పి.సూర్యారావు, వి.గోపి, జి.సూర్యకిరణ్‌, బొడ్డు రాంబాబు, యాగంటి సీత, జిఎస్‌.నారాయణ, జి.విజయశ్రీ, కెఎస్‌.నారాయణ, బి.నాని, పి.సునీల్‌, బి.మణి పాల్గొన్నారు.