ప్రజాశక్తి-సీతమ్మధార : మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని, మెయిన్ ప్లాట్‌పాం, ఒటిటి ఎక్కడైనా అవి విజయం సాధిస్తాయని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం అక్కయ్యపాలెం సింధూరఫంక్షన్ హాల్‌లో డాక్టర్ హరగోపాల్ నటిస్తూ, నిర్మించిన 'డిటెక్టివ్ హరగోపాల్', 'అంతలో..'. చిత్రాల ప్రొమోస్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు చిత్రాల ప్రోమో అద్భుతంగా ఉందని, దీన్ని బట్టి ఆయాచిత్రాలు అద్భుత విజయాలు సాధిస్తాయని ఆకాంక్షించారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన రెండు చిత్రాలను హరగోపాల్ నిర్మాతగా, గీతాశ్రీ ప్రసాద్ దర్శకుడిగా, కథా రచయిత, సంగీత దర్శకుడిగా, జగదీష్ వ్యవహరించారు.
వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ నగరానికి చెందిన నటీనటులు, సాంకేతిక వర్గంతో చిత్రాలు నిర్మించడం అభినందనీయమన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడిసత్యనారాయణ మాట్లాడుతూ ఈ చిత్రాల ద్వారా స్థానిక కళాకారులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించిన హరగోపాల్‌ను అభిందించారు. మంచి కళాకారుడు, గాయకుడైన జివిఎంసి కమిషనర్ లక్ష్మిశ ఈ చిత్రాల ప్రోమోలను విడుదల చేయడం హర్షనీయమన్నారు. కార్యక్రమానికి పి.రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, యాదకుమార్, కృష్ణ కిషోర్, చెన్నా తిరుమలరావు, శివ జ్యోతి, క్యాలు జనార్ధన్ తదితరులు పాల్గొని దర్శకుడు గీతాప్రసాద్, నిర్మాత డాక్టర్ హరగోపాల్‌ను సత్కరించారు.










