ప్రజాశక్తి-వన్‌టౌన్: విద్యార్థులు చదువుతో పాటు మంచి పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించవచ్చని విశ్రాంత సిబిఐ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకల సందర్భంగా యువజన దినోత్సవ వేడుకలు బుధవారం కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవడం ద్వారా ధైర్యంగా అందరి ముందు మాట్లాడగలరని ఆయన సూచించారు. ఏ వృత్తిలో స్థిరపడాలి అని అనుకుంటున్నారో ఆ వృత్తిలోని వారితో తరచూ చర్చించి సూచనలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి లక్ష్మణస్వామి, కోశాధికారి కె.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ జి.లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ ఇ.పతాంజలి శాస్త్రి పాల్గొన్నారు.










