* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ప్రజలకు మంచి చేసిన వారికే ఓటు వేయాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని సీపన్నాయుడుపేటలో మంగళవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం మంచి చేశారని ప్రశ్నించారు. నాలుగేళ్ల వైసిపి పాలనలో ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సాగిన పాలనలో రాష్ట్రం అభివృద్థిపథాన నిలిచిందన్నారు. పాలనా సంస్కరణలను అమలు చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిచామని చెప్పారు. సమగ్ర భూ సర్వేకు ప్రాధాన్యత నిచ్చి భూ తగాదాలు లేకుండా చేశామన్నారు. సంక్షేమ పథకాలను పెద్దఎత్తున అమలు చేసి ప్రజలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వానికి ప్రజల ఆదరణ పెరగడాన్ని తట్టుకోలేని విపక్షాలు విష ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి బేరీజు వేసుకోవాలని ఎవరు మంచి చేశారో ఆలోచించి వచ్చే ఎన్నికల్లో విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. ఈ సందర్బంగా రక్షితమంచినీటి పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, వైసిపి నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి పద్మావతి, డాక్టర్ దానేటి శ్రీధర్, సాధు వైకుంఠరావు, చల్లా అలివేలుమంగ తదితరులు పాల్గొన్నారు.










