ప్రజాశక్తి - ఆరిలోవ : నిత్యం వ్యాయామం, పోషకాహారం, మానసిక ప్రశాంతత వంటి మంచి అలవాట్లుతోనే హృద్రోగాలను నిరోధించవచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బారువా, డాక్టర్ నందకిషోర్ పాణిగ్రహి అన్నారు. గురువారం ప్రపంచ హృద్రోగ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరిలోవ హెల్త్‌సిటీ అపోలో ఆసుపత్రిలో మాట్లాడుతూ, గుండె జబ్బులు రావడానికి కారణాలు, వాటిని ముందుగా ఎలా గుర్తించాలి, నివారణ చర్యలపై హృద్రోగ నిపుణులు సూచనలు సలహాలు అందజేసారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందితే ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చన్నారు. అపోలో సిఇఒ రామచంద మాట్లాడుతూ హృద్రోగులకు అత్యంత సమర్ధవంతమైన చికిత్స అందించడానికి డాక్టర్ దిబ్యా కుమార్ బారువా, నంద కిషోర్ వంటి 20 మంది నిపుణులైన వైద్య బృందం అపోలోలో అందుబాటులో ఉన్నారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అహ్మద్ అఫ్రోజ్ ఫరూక్, డాక్టర్ జైదీప్ కుమార్ త్రివేది, డాక్టర్ శశాంక్ చండూరి, డాక్టర్ చక్రధర్ ఏడాడ, డాక్టర్ సురేష్ కుమార్ పైడి పాల్గొన్నారు.










