Jul 30,2021 14:58

హైదరాబాద్‌ : మహబూబాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపి కవితపై 2019లో బూర్గంపహాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఎంపి కవితకు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.