Mar 10,2023 21:43

ప్రజాశక్తి - ముదినేపల్లి
           గుడ్లవల్లేరు రోడ్డు నుంచి ముదినేపల్లి సెంటర్‌ (వైకూడలి) రోడ్డు వైపు ప్రయాణించాలంటే ప్రయాణికులు, వాహనదారులు హడలెత్తిపోతున్నారు. రోడ్డు మలుపులో ప్రయివేట్‌ సంస్థలకు చెందిన కేబుల్‌లైన్‌ భూమి నుంచి వెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలో ఐరన్‌ హోల్‌ ఏర్పాటు చేశారు. నిత్యం వేలాది వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తుంటాయి. ద్విచక్ర వాహనదారులు, లోడు లారీలు, స్కూల్‌ బస్సులు, ఆటోలు ఈ మలుపు నుంచి గుడివాడ, కైకలూరు రోడ్ల వైపు ప్రయాణిస్తుంటాయి. ఈ మలుపు తిరిగే సమయంలో వాహనాల టైర్లు ఐరన్‌హోల్‌ మూలకు తగిలి ద్విచక్ర వాహనాలు, లారీలు, స్కూల్‌ బస్సులు, ఆటోల టైర్లు పేలిపోతున్న సంఘటనలు నిత్యం చోటు చేసుకున్నాయి. టైర్లు పేలి పెద్దఎత్తున శబ్దం రావడంతో సమీపంలో ఉన్న వ్యాపారులు, ప్రయాణికులు, ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. పలుమార్లు టైర్ల కింద పడిన కంకరరాళ్లు ఎగిరి ప్రజలపై పడడంతో గాయాలపాలవుతున్నారు. ఐరన్‌హోల్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు సూమారు 50కి పైగా వాహనాల టైర్లు పేలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్‌అండ్‌బి అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు భయ పడుతూనే వెళ్తున్నారు. దీనికితోడు రోడ్డు మార్జిన్‌ కూడా అధ్వానంగా మా రింది. అధికారులు వెంటనే స్పందించి ఐరన్‌ హోల్‌ కనిపించకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు, వాహనదారులు, ప్రయాణికులు అధికారులను ముక్తకంఠంతో కోరుతున్నారు.