ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : పార్వతీపురంలో మంజూరైన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం పనులను కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్ర వారం పరిశీలించారు. రూ.49.26 కోట్లతో మంజూరైన ఈ ఆసుపత్రి పనులను ఎపిఎంఎస్‌ఐడిసి ఇప్పటికే ప్రారంభించింది. పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు అధికంగా కురవక ముందే ప్రాథమిక పనులు పూర్తి చేయాలని సూచించారు. పునాదుల స్థాయిని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. పనులు పక్కాగా చేయాలని, నాణ్యతలో రాజీ ఉండరాదన్నారు. ప్రణాళికాబద్ధంగా చేపట్టడం వల్ల పనులు సకాలంలో పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రిలో రూ.1.81 కోట్లతో జరుగుతున్న ఆధునికీకరణ పనులను కలెక్టర్ పరిశీలిం చారు. ఆసుపత్రి భవనం సుందరంగా తీర్చిదిద్దాలని, అన్ని పనులు పక్కాగా ఉండాలని అన్నారు. బర్త్ వెయిటింగ్ హౌం, ఐసియు తదితర పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రన్నింగ్ వాటర్, కాలువలు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య రంగంలో జిల్లా ఆసుపత్రి ప్రధాన వనరుగా ఉందని, దీని సేవలు జిల్లా ప్రజలకు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి.వాగ్దేవి పనుల వివరాలు తెలిపారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్‌ఒ డాక్టర్ బి.జగన్నాథరావు, ఆర్.బి.ఎస్.కె ప్రాజెక్టు అధికారి డా. ధవళ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.










