Mar 19,2023 22:52

ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం : కొండపల్లి శాంతి నగర్‌ ఇందిరమ్మ కాలనీలో వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్య్ర సమర యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ప్రధమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ఐద్వా నాయకులు పుష్పములు సమర్పించి నివాళులర్పించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలని ఐద్వా మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.బేబీ సరోజిని, ఎల్‌.పార్వతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం, భూమి, భుక్తి కోసం దొరతనాన్ని సవాల్‌ చేస్తూ తుపాకీ చేతపట్టిన తొలి మహిళ స్వరాజ్యం అన్నారు. ఆమె మాటే తుపాకీ తూటా అని చెప్పారు. దోపిడీ లేని రాజ్యం రావాలని ఆమె పోరాడారని గుర్తు చేశారు. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గిరిజనులను ఆమె మేల్కొలపారని చెప్పారు. జానపద బాణీల్లో పాటలు రచించి స్వయంగా పాడి గ్రామాల్లో ప్రజలను ఆకట్టుకునే వారని తెలిపారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు సీపీఎం ఎమ్మెల్యేగా పనిచేశారని చెప్పారు. స్వరాజ్యం ఆశయ సాధనకు మహిళలు కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా మండల కమిటీ సభ్యులు ఎస్‌.వెంకట రమణ, సిహెచ్‌.స్వరూప రాణి, స్థానిక మహిళలు వి.హైమావతి, కళ్యాణి, రత్నం, సంషేద్‌ బేగం, పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.