Feb 20,2023 21:39

రాష్ట్ర గవర్నర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న దృశ్యం

మల్లన్నను దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్‌ దంపతులు
పూర్ణకుంభంతో స్వాగతం
ప్రజాశక్తి- శ్రీశైలం

     ప్రసిద్ధ శైవక్షేత్రమైన భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రగవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఉదయం 9-54 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు గవర్నర్‌ దంపతులు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌, జిల్లా ఎస్‌పి రఘువీర్‌ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. సున్నిపెంట హెలిప్యాడ్‌ నుండి శ్రీశైలంలోని భ్రమరాంబా అతిథిగృహం వద్ద కాసేపు సేద తీరిన అనంతరం శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల దర్శనార్థం గవర్నర్‌ దంపతులు ఆలయం వద్దకు ఉదయం 10-44 గంటలకు చేరుకున్నారు. గంగాధర మండపం వద్ద రాష్ట్ర గవర్నర్‌ ధర్మపత్ని సుప్రభ హరిచందన్‌, కుమారుడు ప్రశంజిత్‌ హరిచందన్‌, కోడలు సరోజిని హరిచందన్‌లకు ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఇఒ లవన్న, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్‌ వెంట జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌, జిల్లా ఎస్‌పి రఘువీర్‌ రెడ్డిలు ఉన్నారు.
స్వామి అమ్మవార్లను ప్రత్యేక పూజలు
రత్నగర్భగణపతిస్వామిని దర్శించుకుని హారతిని స్వీకరించారు. తదుపరి మల్లికార్జునస్వామిని దర్శించుకుని రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికా గుండంలో (సరస్వతీ నదీ అంతర్వాహిని) ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. తదుపరి భ్రమరాంబాదేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కుటుంబానికి అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. తరువాత శేషవస్త్రాలను, లడ్డుప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డిచక్రపాణి రెడ్డి, దేవస్థానం ఇఒ లవన్నలు అందచేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సిఇఒ సుబ్బారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు గురుమహాంతు ఉమామహేష్‌, ఎం.విజయలక్ష్మి, ఎ.లక్ష్మీ సావిత్రి, మేరాజోత్‌ హనుమంత్‌ నాయక్‌, డాక్టర్‌ కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.
గవర్నర్‌ కువీడ్కోలు: భ్రమరాంబ అతిధి గృహం నుండి సున్నిపెంట హెలిప్యాడ్‌కు రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. హెలిప్యాడ్‌కు చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌, జిల్లా ఎస్‌పి రఘువీర్‌ రెడ్డిలు ఘనంగా వీడ్కోలు పలికారు.