మల్లన్న సన్నిధిలో సిజెఐ దంపతులు
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం వచ్చిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వై. చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనా దాస్, సుప్రీంకోర్టు జడ్జి పిఎస్ నరసింహ ఆయన సతీమణి సత్యప్రభ ఆదివారం తెల్లవారుజామున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఇఒలవన్న, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం రత్నగర్భ గణపతి స్వామిని దర్శించుకుని హారతిని అందుకున్నారు. తదుపరి మల్లికార్జునస్వామిని దర్శించుకుని రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మల్లికా గుండంలో (సరస్వతీ నదీ అంతర్వాహిని) ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన చేశారు. తదుపరి అర్చకస్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందచేశారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఇఒ లవన్నలు స్వామి అమ్మవార్ల చిత్ర పటాలను అందచేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనుంజయ వై. చంద్రచూడ్ వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్ కె.సుజన, దేవాదాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, కర్నూలు ఎన్. శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్‌పి కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తదితరులు వున్నారు.
మల్లన్న సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శ్రీశైల క్షేత్రంలోని స్వామిఅమ్మవార్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్‌రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామి అమ్మవార్లు దర్శనార్థమై ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వీరికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వేద పండితులు సంప్రదాయపదలు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ముందుగా మల్లికార్జున స్వామిని ఆ తర్వాత భ్రమరాంబ దేవిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచన మండపంలో పేద పండితులు వీరికి ఆశీర్వచనం పలకగా శేష వస్త్రాలను లడ్డుప్రసాదలను దేవస్థానం అధికారులు అందజేశారు.










