Nov 03,2023 21:16

ప్రజాశక్తి - పాలకొల్లు
రోజురోజుకీ పెరుగుతున్న ఉల్లిపాయలు, టమోటా ధర పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 15 రోజుల క్రితం వరకూ కిలో రూ.20 నుంచి రూ.25 ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం కిలో రూ.70కుపైగానే ధర పలుకుతోంది. దీంతో మహిళలకు ఉల్లి కోయక ముందే కన్నీరు వస్తోంది. కొన్ని నెలల క్రితం కిలో టమోటా ధర డబుల్‌ సెంచరీకి చేరి అందరినీ ఠారెత్తించింది. గత నెల రోజులుగా కిలో రూ.20కు తగ్గిన టమోటా వారం రోజుల నుంచి పెరుగుతూ ప్రస్తుతం రూ.40కు చేరింది. బంగాళాదుంపలు హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో రూ.17గానే ఉన్నా రిటైల్‌ మార్కెట్లో కిలో రూ.30గా ఉంది. పచ్చిమిర్చి గతేడాది ఇదే సీజన్‌లో కిలో రూ.20 నుంచి రూ.30 మధ్య ఉండగా ఈ ఏడాది కిలో రూ.50 నుంచి రూ.70 మధ్య ఉంది. అల్లం ధర కూడా అనూహ్యంగా పెరిగింది. వెల్లుల్లి మూడు నెలల క్రితం కిలో రూ.40 నుంచి రూ.50 నడుమ ఉండగా ప్రస్తుతం కిలో రూ.180 నుంచి రూ.220 మధ్య నాణ్యత బట్టి ధర ఉంది. ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాడే కందిపప్పు కిలో రూ.170 నుంచి రూ.190 మధ్య ఉంది. దీంతో సామాన్యులు కూరగా యలంటేనే బెంబే లెత్తుతున్నారు.