మళ్ళీ ట్రూ అప్ వసూలు
- ఈ నెల నుండి బిల్లులో కలిపి
- రూ.163 కోట్ల మేర ఉమ్మడి జిల్లాపై భారం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్తు వినియోగదారులపై భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత 9 నెలలుగా ట్రూఅప్ (సర్దుబాటు) ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.. దీనికి అదనంగా ఈ నెల నుంచి మరికొంత వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల నుంచి వచ్చే విద్యుత్తు బిల్లులు భారీగా పెరగనున్నాయి.
ఎపిఇఆర్‌సి నుంచి రెండో విడత సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసేందుకు ఇప్పటికే అనుమతి వచ్చింది. ఇందులో భాగంగా 2021-22 సంవత్సరానికి సంబంధించి డిస్కంకు వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయనున్నారు. 2021-22 ఏప్రిల్‌లో వాడిన యూనిట్లపై ట్రూఅప్ భారాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో కలపనున్నారు. ఏ నెలకు సంబంధించిన బిల్లును ఆ నెల వసూలు చేయనున్నారు. అప్పట్లో అధికంగా విద్యుత్తు వాడకం ఉంటే.. ప్రస్తుతం అందుకు సంబంధించిన భారం సామాన్యులపై పడనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 11 లక్షలకు పైగా విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ, వాణిజ్య, పరిశ్రమలపై భారం వేయనున్నారు. నికరంగా 12.50 లక్షల మందిపై సుమారు రూ.163 కోట్ల మేర భారం పడనుంది. 2019 ఏప్రిల్ తర్వాత తీసుకున్న విద్యుత్తు కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చారు. గతేడాది ఆగస్టు నుంచి తొలి విడత ట్రూ అప్ చార్జీలు వసూలు చేస్తున్నారు. 2014 నుండి వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ట్రూఅప్ చార్టీల పేరుతో వసూలు చేస్తున్నారు. కర్నూలు సర్కిల్లోని విద్యుత్తు వినియోగదారుల నుంచి 38 నెలల పాటు వసూలు చేస్తున్నారు. గతంలో వినియోగించుకున్న ప్రతి యూనిట్‌కు 23 పైసలు లెక్క కట్టి బిల్లులో వేస్తున్నారు. ఇలా నాలుగు త్రైమాసికాల్లో నెల వారీగా వసూలు చేసేందుకు చేశారు. ఇప్పటికే బిల్లింగ్‌కు సంబంధించిన సాప్ట్‌వేర్‌ను అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న బిల్లులో ఇప్పటికే వసూలు చేస్తున్న సర్దుబాటు ఛార్జీల కారణంగా బిల్లులో 5 నుంచి 10 శాతం వరకు పెరుగుదల కనిపించొచ్చు. కొత్తగా విధిస్తున్న ఛార్జీలు కారణంగా ఈ భారం మరింత పెరిగే అవకాశముంది.










