Mar 13,2023 23:57

నర్సీపట్నంలో ప్రధాన రహదారి

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:నర్సీపట్నంలో రద్దీ పెరగడంతో ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో గత ప్రభుత్వ హయాంలో రోడ్డు 120అడుగులు వెడల్పు చేయాలని అప్పట్లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనుకోకుండా ఊహించని పరిణామాలతో అప్పట్లో రోడ్డు అభివద్ధికి అయ్యన్న వెనకడుగు వేయడంతో వెడల్పు ప్రక్రియ ఆగి పోయింది. ఇటీవల ఆ ప్రతిపాదన స్థానిక శాసనసభ్యులు మళ్లీ తెరపైకి తీసుకు వచ్చారు. ఉమా శంకర్‌ గణేష్‌ రోడ్డు అభివృద్ధికి ముఖ్యమంత్రితో మాట్లాడి సుమారు 11 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించారు.దీంతో అధికార యంత్రాంగం భవిష్యత్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే సూచనతో వంద అడుగులు వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చక చకా పనులు ప్రారంభించి డిజిటల్‌ సర్వే చేసి రోడ్డు మార్కింగ్‌ను పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా 100 అడుగులు వెడల్పు చేస్తే తామంతా నష్టపోతామని బిల్డింగ్‌ యజమానులు వాపోయారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం వాణిజ్య సముదాయాల యజమానులు సంఘటిత మయ్యారు. దీనిపై ఆదివారం ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మెయిన్‌ రోడ్‌ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. నర్సీపట్నం మెయిన్‌ రోడ్‌ వెడల్పు చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని వంద అడుగులు వెడల్పు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తమకీ ఆమోదయోగ్యంగా ఉండేవిధంగా ఎనభై అడుగులు వెడల్పు చేసే అంశాన్ని పునరాలోచన చేయాలని కోరారు. ఈనెల పద్నాలుగున పట్నంలో వ్యాపార సంస్థలు బంద్‌ పాటించాలని తీర్మానం చేశారు.అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్‌, మున్సిపల్‌, రెవెన్యూశాఖ అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని భవన యజమానులు నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉండగా మరోపక్క నానాటికి పెరిగి పోతున్న ట్రాఫిక్‌ సమస్య నేపద్యంలో అధికారులు నిర్ణయించినట్టుగానే వంద అడుగులు వెడల్పు చేయడం అవసరమని, భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు, మేధావులు, పట్టణవాసులు, తదితరులు అభిప్రాయ పడుతున్నారు.