Nov 19,2023 21:04

ప్రజాశక్తి - పాలకోడేరు
గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళిత బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. సాంఘిక బహిష్కరణకు గురైన తమకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం పాత పంచాయతీ భవనం వద్ద నిరసన తెలిపారు. దళితులు భారీ సంఖ్యలో పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించి ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బహిష్కరణ దళిత బాధిత నాయకులు మాట్లాడారు. 2017లో టిడిపి హయాంలో సాంఘిక బహిష్కరణకు గురయ్యారని తెలిపారు. ఆ సమయంలో కేవలం 262 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం అందించి చేతులు దులుపుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దళిత నేత డాక్టర్‌ గొల్లమూడి రాజా సుందరబాబు తమకు అండగా నిలబడ్డారన్నారు. ప్రభుత్వం, కోర్టుతో న్యాయ పోరాటం చేసి 500 మందికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున సాధించామని తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి శాసనమండలి ఛైౖర్మన్‌ మోషన్‌రాజు, అప్పటి మంత్రి రంగనాథరాజు, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్‌పిలు కాగితం రూపంలో హామీ ఇచ్చారని తెలిపారు. సుమారు ఐదేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ పెద్దలు, అధికారుల హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. ప్రతి కుటుంబానికీ మూడెకరాల వ్యవసాయ భూమిని అందించాలని డిమాండ్‌ చేశారు. మిగిలిన 106 మందికి నష్టపరిహారం అందించాలన్నారు. డిమాండ్లు పరిష్కరించాకే అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
వెంకటరత్నం టిడిపిలో చేరడం హాస్యాస్పదం
గరగపర్రు ఆత్మగౌరవ పోరాట నాయకుడునని చెప్పుకుంటున్న సిరంగుల వెంకటరత్నం టిడిపిలో చేరడం హాస్యాస్పందంగా ఉందని సాంఘిక బహిష్కరణ దళిత బాధిత నాయకులు విమర్శించారు. అప్పటి టిడిపి హయాంలోనే బహిష్కరణకు గురి కావడం జరిగిందని ఈ కేసులో ముద్దాయిలుగా టిడిపి నాయకులు ఉంటే వెంకటరత్నం టిడిపిలో ఎలా చేరారని ప్రశ్నించారు. ముద్దాయిలతో వెంకటరత్నం కొమ్మక్కవ్వడంతో మోసం బయటపడిందని తెలిపారు. బాధిత దళితులకు వెంకటరత్నానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై సోమవారం జిల్లా స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, ఎస్‌పికి ఫిర్యాదు చేయనున్నట్లు దళిత బాధితుల కమిటీ నాయకులు తెలిపారు.
ఆరోపణలన్నీ అవాస్తవం : వెంకటరత్నం
తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని గరగపర్రు ఆత్మగౌరవ పోరాట నాయకులు సిరింగుల వెంకటరత్నం ఖండించారు. ప్రజాశక్తితో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తనపై ఆరోపణలు చేస్తున్న వారంతా గరగపర్రు ఉద్యమంలో లేరన్నారు. ఎన్నో కేసులు బనాయించినప్పటికీ ప్రాణాలకు తెగించి ఉద్యమాన్ని ముందుండి నడిపించానన్నారు. ఇటీవల బాధితులతో విజయవాడ కూడా వెళ్లి అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబుకు సమస్యలు వివరించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఉద్యమాన్ని వదలకుండా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు.