Nov 10,2022 23:41

పులి చేతిలో హతమైన ఆవు దూడ

నక్కవానిపాలెంలో ఆవు దూడ హతం
బెంబేలెత్తుతున్న జనం
ప్రజాశక్తి- సబ్బవరం
: గత మూడునెలలుగా అనకాపల్లి గ్రామీణ జిల్లాలో హల్‌చల్‌ చేస్తున్న పులి, గురువారం వేకువజామున మళ్లీ పంజా విసిరింది. మండలంలో అసకపల్లి పంచాయతీ శివారు నక్కవానిపాలెం గ్రామంలో చిన్ని వెంకునాయుడు అనే రైతుకు చెందిన లేగ దూడను హతమార్చింది. బుధవారం రాత్రి కల్లాల వద్ద నున్న పాకలో ఆవుదైడను కట్టి ఇంటికెళ్లిన వెంకునాయుడు, గురువారం ఉదయాన్నే అక్కడకు వెళ్లి చూసేసరికి కేవలం దూడ తల మాత్రమే ఉంది. అక్కడికి సుమారు 200మీటర్ల దూరంలో నీలగిరి తోటలో సగం తిని వదిలేసిన మొండెం కనిపించింది.
గురువారం ఉదయం సున్నం బట్టీలకు చెందిన నోట్ల దేముడు అనే వ్యక్తి తన మేకలకు మేత కోసం కొమ్మలు తెచ్చేందుకు నీలగిరి తోటవైపు వెళ్లగా పులి కనిపించడం భయంతో కేకలు వేస్తూ పరిగెత్తుకొచ్చి గ్రామస్తులకు తెలిపాడు. స్థానికులు వెళ్లి చూడగా పులి గాండ్రింపులు వినబడ్డాయని, దీంతో భయపడి వెనక్కు వచ్చేశామని అంటున్నారు. బాణసంచా పేల్చి పులిని తరిమికొట్టినట్లు చెబుతున్నారు. గడచిన రెండునెలల్లో సబ్బవరం మండలంలోనే 20వరకు మూగజీవాలు పులికి బలయ్యాయని, అటవీశాఖాధికారులకు విషయం చెప్పినా సరిగా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు.
తెలపడంతో గ్రామస్తులు అందరూ కలిసి వెళ్లి చూడగా పులి గాండ్రింపులు వినిపించడంతో వారు కూడా భయపడే పరుగులు తీశారు.బాణసంచాలు, బాంబులు పేల్చారు.గత రెండు మూడు నెలలుగా సబ్బవరం మండలంలో గల పలు గ్రామాల్లో పులి చేసిన దాడికి సుమారు 10 నుంచి 20 జంతువులు బలయ్యాయని ఈ విషయంపై ఫారెస్ట్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ కి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని ,తూతు మంత్రంగా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పులిసంచారంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఎంపిటిసి కర్రి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు చర్యలను వేగవంతం చేసి పులిని బంధించాలని కోరారు. కాగా విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ కె. అప్పారావు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ బి.యాదగిరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.