'మళ్లీ అవే మాటలు.. అవే ప్రకటనలు.. ఇక కార్యాచరణపైనే అందరి దృష్టి'.. ఇదీ దాళ్వాకు సాగునీరు అందజేత, నూజివీడులో సిఎం పర్యటన, ధాన్యం కొనుగోళ్లలో తేమ శాతం అంశాల విషయంలో ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారుల తీరు.
దాళ్వాకు సాగునీరు అందజేతపై ఇటు ఏలూరు, అటు పశ్చిమగోదావరి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యాన జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహా మండలి సమావేశాలు వేర్వేరుగా జరిగాయి. రెండు సమావేశాల్లోనూ గోదావరిలో నీటి లభ్యత, సీలేరు జలాలు తదితర అంశాలతోపాటు కాల్వలకు నీరు నిలిపివేత ఎప్పటి నుంచి అనేది చర్చించి తీర్మానాలు చేశారు. అక్కడా.. ఇక్కడా కూడా ఇరిగేషన్ అధికారులు లెక్కలు చెప్పగా వాటినే వివిధ రూపాల్లో సర్ది దాళ్వా సాగుకు సమృద్దిగా సాగునీరందిస్తామని ఆయా మంత్రులు ప్రకటించేశారు. ఆపై నారుమడుల ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా ముగించేయాలని సైతం స్పష్టం చేశారు. లేనిపక్షంలో సాగునీటి ఇబ్బందులు తప్పవని చల్లగా చావుకబురు చెప్పకనే చెప్పారు. దానికి సంబంధించి నారుమళ్ల ప్రక్రియ వేగవంతం చేసే బాధ్యత వ్యవసాయ శాఖపై మోపారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఏలూరు జిల్లాలో చింతలపూడి, చాట్రాయి తదితర మెట్ట మండలాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కరెంటు సక్రమంగా సరఫరా కాక బోర్ల కింద పంటలు సైతం ఎండిపోయే దుస్థితి నెలకొంది. ఈ సమస్యపై కనీసం చర్చకు అవకాశం ఇవ్వకపోగా ప్రస్తావించిన పిడిఎఫ్ ఎంఎల్‌సి షేక్ సాబ్జీని నిలువరించి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవాలని చెప్పడం హాస్యాస్పదమనే వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. సమస్యపై చర్చించి ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి ప్రతిపాదించాల్సిన సమావేశంలో సమస్యను పక్కదారి పట్టించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దాళ్వా సాగుకు సంబంధించి నారుమళ్లు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగులో నీరు సక్రమంగా అందక, ప్రకృతి కన్నెర్రతో దిగుబడులు తగ్గి రైతులు తల్లడిల్లుతున్నారు. పైకి కన్పించకపోయినా గత దాళ్వాలో ధాన్యం అమ్ముకునే సమయంలో ఎదురైన ఇబ్బందులన్నీ ప్రస్తుతమూ రైతులను వెంటాడుతున్నాయి. అయితే ఇంకా మాసూళ్లు పూర్తికాకపోవడంతో సమస్య తీవ్రత పెద్దగా తెలియడం లేదు. అయితే ఆర్‌బికెల్లో నిర్థారించిన తేమ శాతమే ఫైనల్ అని, మిల్లర్లు ఎందుకు మళ్లీ తేమ శాతంపై మెలిక పెడుతున్నారనేది పరిశీలిస్తామని సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ ఉంగుటూరులో రైతులకు చెప్పారంటే సమస్య అపరిష్కృతంగానే ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగానే రైతుల నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఊకదంపుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మరి ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకుండా, రైతుల చేతికి సొమ్ము రాకుండా దాళ్వాసాగు ఎలా ప్రారంభిస్తారో అధికారులు, ప్రజాప్రతినిధులే చెప్పాలి. సాగులో ఆలస్యానికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రకృతి విపత్తులైతే ప్రధానమైనది మాత్రం పెట్టుబడి సమస్య. సాగులో 80 శాతంగా ఉన్న కౌలురైతులకు కనీసం రుణార్హత గుర్తింపు కార్డులు ఇవ్వడంలోనే బాగా వెనుకబాటు ఉంది. ఆ కార్డులు అందుకున్న వారికి రుణాలివ్వడంలోనూ బ్యాంకర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని కలెక్టర్లు నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో తేట తెల్లమవుతోంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం అమ్మకాలు పూర్తికాకుండా రైతులు దాళ్వా సాగు ఎలా చేపడతారో అధికారులు, ప్రజాప్రతినిధులకే తెలియాలి. కనీసం ఇప్పటికైనా దాళ్వా సాగుకు అవసరమైన పెట్టుబడిని రుణాల రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే నిర్ణీత సమయంలో నారుమళ్ల పనులు రైతులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అదేమీ లేకుండా సమృద్ధిగా సాగునీరంటూ మరోసారి రైతులను నష్టాల ఊబిలోకి దించొద్దని పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
నూజివీడులో సిఎం పర్యటన ఊరించి ఉసూరుమన్పించింది. అసైన్డ్ భూములపై సర్వహక్కులు కల్పిస్తూ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేసేందుకు నూజివీడులో శుక్రవారం పెద్దఎత్తున సభ నిర్వహించారు. చింతలపూడి ఎత్తిపోతలను త్వరలోనే పూర్తి చేస్తాం, నూజివీడులో ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్, నూజివీడు పట్టణంలోని 32 వార్డులకు రూ.కోటి చొప్పున అభివృద్ధి నిధుల మంజూరు తప్ప సిఎం జగన్ ఇతర అంశాల జోలికెళ్లలేదు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రభుత్వం వచ్చాక చేసిందేమీ లేదు. కనీసం చింతలపూడి పరిసర ప్రాంతాల్లో భూసేకరణ నేపథ్యంలో నష్టపోతున్న రైతులకు సంబంధించి పరిహారం సమస్య నేటికీ అపరిష్కృతంగానే ఉంది. ఈ సమస్యలన్నీ అలానే ఉంచి యుద్ధప్రాతిపదికన ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామంటే ఎవరూ నమ్మే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక నూజివీడు మామిడి జాతీయస్థాయిలోనే ప్రసిద్ధి చెందింది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సమస్యలతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడంతో మామిడి సాగు క్రమేపీ కుచించుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా మనడం తప్ప మామిడి సాగు ప్రోత్సాహకానికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించకపోవడం మామిడి రైతులను నిరాశపర్చింది. నూజివీడు పట్టణంలో 16 సచివాల యాలకు రూ.కోటి చొప్పున నిధులిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. అంటే ఒక్కో వార్డుకు రూ.50 లక్షల వరకూ నిధులిచ్చినట్లే. ఇదే ఆచరణకు నోచుకుంటే ఆయా వార్డుల్లో చిన్నపాటి సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇవి మినహా సిఎం ప్రసంగంలోని మిగిలిన అంశాలన్నీ కొత్త సీసాలో పాత నీరువంటివేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో పేరుకుపోయిన రోడ్లు అధ్వానం, మెట్ట ప్రాంతంలో కరువు ఛాయలు, కొల్లేరు, పరిసర ప్రాంతాల ప్రజల్లో నెలకొన్న ఎకోసెన్సిటివ్ జోన్ భయాందోళనలపై సిఎం జగన్ కనీసం నోరు మెదపకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా సిఎం నుంచి ఎటువంటి నిర్ధిష్ట హామీలూ రాకపోవడం నూజివీడు ప్రాంత ప్రజలతోపాటు ఏలూరు జిల్లావాసులను నిరాశకు గురిచేసింది. ఇప్పటికైనా మళ్లీమళ్లీ పాతపాట మాని రెండు జిల్లాల్లో ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని జిల్లావాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఎన్నికల్లో ఈ ప్రభుత్వం విషయంలో జనాలు పునరాలోచించే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్