Jan 03,2021 08:11

    ఏది ఎలా వున్నా అమరావతి సమస్యతో సహా అన్ని అంశాలలో ప్రజలకూ రాష్ట్రానికీ న్యాయం జరగాలి. పాక్షిక రాజకీయాలు, తక్షణ ప్రయోజనాలు గాక ప్రజాస్వామ్య హక్కులు, సమ న్యాయం, లౌకికతత్వం, రాజ్యాంగ విలువలు రక్షించబడటం కీలకం. న్యాయ వ్యవస్థ, న్యాయవాద వ్యవస్థ కూడా లోపలి నుంచి బయటి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నదనీ... రాజకీయంగా, సామాజికంగా, మతపరంగా చీలిపోయి స్వతంత్రత కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్‌ జోసఫ్‌ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గుర్తు చేసుకోవడం అవసరం.
   భారత న్యాయ వ్యవస్థ పైన, సుప్రీంకోర్టు లోనూ హైకోర్టుల లోనూ న్యాయమూర్తుల శైలి పైన తీవ్రమైన మధనం జరుగుతున్న వేళ...ఎ.పి హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ రోజు ఒక తీర్పులో చేసిన అసాధారణ, అసందర్భ వ్యాఖ్యలు మరింత వివాదగ్రస్త వాతావరణం సృష్టించాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా పలువురిని సుప్రీంకోర్టు రెండవ సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రభావితం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ.బాబ్డే కు రాసిన లేఖ అనంతర పరిణామాలు కూడా ఈ తీర్పులో ప్రస్తావనకు రావడమే గాక జస్టిస్‌ రాకేశ్‌ స్వయంగా సుప్రీంకోర్టు కొలీజియం మీద, హైకోర్టులో బదిలీల మీద వ్యాఖ్యలు చేయడం భిన్న స్పందనలకు దారితీసింది. ముఖ్యమంత్రి ఈ విధమైన లేఖ రాయడం దేశ చరిత్రలో ఎరుగనిదైనా అందులోని అంశాలపై సిజెఐ చర్య తీసుకోవలసిందేనన్న భావన న్యాయ వర్గాలలో విస్త్రుతంగా వ్యక్తమైంది. దానికి తగినట్టే బాబ్డే ముఖ్య మంత్రిని తన ఆరోపణలను ఒక అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని కోరినట్టు, జస్టిస్‌ రమణ నుంచి, ప్రస్తుతం బదిలీ అయిన హైకోర్టు సి.జె జె.కె.మహేశ్వరి నుంచి కూడా సమాధా నాలు కోరినట్టు సమాచారం వచ్చింది. సి.జె మహేశ్వరి విస్తారమైన సమాధానం ఇచ్చారని తెలుస్తుండగా జస్టిస్‌ రమణ స్పందన ఎలా వుందనేది బయటకు రాలేదు. దీనికి సమాంతరంగా సుప్రీంకోర్టు కొలీజియం చీఫ్‌ జస్టిస్‌ మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసి అక్కడి సి.జె అరూప్‌ కుమార్‌ గోస్వామిని ఎ.పి కి రప్పించింది. సాధారణ తరహా లోనే జరిగిన ఈ ప్రక్రియ జగన్‌ లేఖ వల్ల జరిగిందని జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ తన తీర్పులో ఆరోపించారు. ఈ బదిలీ వల్ల హైకోర్టులో రాజధాని కేసులు ఆలస్యమవుతాయని కూడా పేర్కొన్నారు. జగన్‌ లేఖ వల్ల తనపై వున్న సిబిఐ కేసులలో అనుచిత లబ్ధి కలుగుతుందని కూడా వ్యాఖ్యానించారు. జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ముందున్న కేసుకు ఈ అంశాలకు సంబంధం లేదు. సాంకేతికంగా సంబంధం లేదని ఆయనే తెలిపారు. మరైతే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు? ఈ పరిస్థితి ఎలా ఏర్పడినట్టు ?
 

                                                రాజ్యాంగ వైఫల్యం-విచారణ, వ్యాఖ్యలు
   'బిల్డ్‌ ఎ.పి' పేరిట ఎ.పి ప్రభుత్వం తన అధీనం లోని ఆస్తుల అమ్మకానికి నిర్ణయం తీసుకుంది. అందుకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలై, జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌-ఉమాదేవి ధర్మాసనం ముందుకు ఆ కేసు వచ్చింది. ఆ సందర్భంలో జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమై ఆర్థిక అత్యయిక పరిస్థితి ఏర్పడిందా? అలా అయితే కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పాలా? అని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ అభ్యంతరం తెల్పుతూ అనుబంధ పిటిషన్‌ వేశారు. రాజ్యాంగం విఫలమైందని వ్కాఖ్యానించడం ద్వారా జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌కు ముందే దురభిప్రాయం వెలిబుచ్చారు గనక ఈ కేసు విచారణ నుంచి ఆయన తప్పుకోవాలని అందులో కోరారు. తాను అలా అనలేదని, అనని మాటలు తనకు ఆపాదిస్తున్నారని ఆయన చెప్పారు. అసలు పిటిషనర్ల తరపు లాయర్లను అడిగితే వారూ అదే చెప్పారు. తన పదవీ కాలం ముగింపులో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనవలసి రావడం దురదృష్టకరమంటూ జస్టిస్‌ రాకేశ్‌ తీర్పును వాయిదా వేసి ఆఖరి రోజు వెలువరించారు. దీనికి ముందు మరో కేసులో పోలీసులపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ సందర్భంలోనూ రాజ్యాంగం విఫలమైందో లేదో తేలుస్తానని ఆయన విచారణ ప్రారం భించారు. రాజ్యాంగ రీత్యా 356వ అధిక రణం కింద గవర్నర్‌ నివేదికపై రాష్ట్రపతి మాత్రమే ఆ విధమైన నిర్ణయం తీసుకో గలరు. అందుకే జస్టిస్‌ రాకేశ్‌ వ్యాఖ్యలు, విచారణపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. కాకపోతే రాజ్యాంగంలో ఒక లొసుగు వుంది. గవర్నర్‌ నివేదిక ద్వారా గాని మరో విధంగా గాని (అదర్‌వైజ్‌) రాజ్యాంగం విఫల మైందని భావిస్తే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవచ్చని రాజ్యాంగం చెబుతుంది. ఈ ఆధారంతోనే 1997లో పాట్నా హైకోర్టు ఒకసారి ఇలాగే చేసినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వాల హక్కులకు భంగకరమని నిపుణలు స్పష్టం చేశారు. అదే రీతిలో ఇప్పుడు జస్టిస్‌ రాకేశ్‌ ప్రారంభించిన విచారణ పైన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చింది. ఈ చర్య చాలా ఆందోళన కలిగిస్తున్నదని అత్యు న్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో 'బిల్డ్‌ ఎ.పి' కేసులో అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్య శ్రీరాం తోనూ జస్టిస్‌ రాకేశ్‌కు తీవ్ర వాగ్వాదం జరిగి ఆయన వాదనకే రాబో నని దూరముండిపోయారు. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్న వోలు సుధాకరరెడ్డి వాదించారు. తను అనని మాటలు తనకు ఆపాదించడం ద్వారా ఐఎఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కోర్టు ధిక్కా రానికి పాల్పడ్డారని, ఆయనపై క్రిమినల్‌ చర్యలు ప్రారంభిం చాలని రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ 55పేజీల సుదీర్ఘ తీర్పునిచ్చారు.
                                                       

                                                       సమస్త వివాదాలు ఏకరువు
   జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ తన తీర్పులో ముఖ్యమంత్రి జగన్‌ పైన, శాసనసభ, సుప్రీంకోర్టు కొలీజియం తదితర అంశాల పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇవన్నీ 'బిల్డ్‌ ఎ.పి' కేసుకు గాని లేక తను ధర్మాసనంలో కొనసాగాలా లేదా అన్న దానికి గాని సంబంధించినవి కావు (ధర్మాసనం లోని జస్టిస్‌ రమేష్‌ కోర్టు ధిక్కారం అంశం వరకూ ఏకీభవించారని సమాచారం). సిజెఐ కి ముఖ్యమంత్రి లేఖ బహిరంగంగానే రాసినప్పుడు అది వారిద్దరికి సంబంధించిన అంశం తప్ప హైకోర్టు న్యాయమూర్తికి సంబంధం లేదు. సిజెఐ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయడం లేఖ కారణంగానే అని నిర్ధారించడానికీ అవకాశం లేదు. కొలీజియంపై విమర్శలు గతంలోనూ వున్నాయి గాని ఇక్కడ ఈ సందర్భంలో పారదర్శకత లేదని ఆరోపించడం అంటే అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పు పట్టడమే అవుతుంది. ఎవరి తప్పొప్పులు ఏమైనా హైకోర్టుకు, ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభననూ వివాద వాతావరణాన్ని చక్కదిద్దడం అనివార్యం గనక బదిలీ అందుకు దోహదం చేస్తుంది. ఆరోపణలు, సమాధానాలు కొనసాగుతూనే వుంటాయి. వాస్తవానికి ఆ లేఖ రాసిందే హైకోర్టు తీరు పైన గనక వారే వాటిపై వ్యాఖ్యలు చేయడమూ సముచితంగా వుండదు. ఇక శాసనమండలి రద్దు రాజ్యాంగ రీత్యా శాసనసభ నిర్ణయమైనప్పుడు నిబంధనలు పాటించడంలో లోపాలుంటే కొట్టేయవచ్చు గాని రాజకీయ వ్యాఖ్యల వల్ల ప్రయోజనం వుండదు. ముఖ్యమంత్రి జగన్‌ను గురించి ఖైదీ నెంబర్‌ 6093 అనీ, ఎవరో చెబితే గూగుల్‌లో వెతికి తనపై వున్న 36 కేసుల గురించి తెలుసుకున్నానని తీర్పులో రాయడం మరీ విపరీతం. ఇంతకూ జగన్‌పై కేసులలో శిక్షలు, ముఖ్యమంత్రి మారడం గురించి వినిపించే జోస్యాల మధ్య ఈ న్యాయమూర్తి చెప్పిందే మంటే ఆయనపై ఇంకా అభియోగాల నమోదు జరగనేలేదని! తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు గనక అవి మరింత ఆలస్యమవు తాయని. అంటే న్యాయస్థానాలు కేసులకు సంబంధించి మీడియాలో కథనాలకు, వాస్తవాలకు ఎంత తేడా వుందో ఇక్కడే తెలుస్తుంది. ఎవరిపై వున్న ఏ కేసులైనా న్యాయ సూత్రాల ప్రకారం సత్వరం పరిష్కారం కావాలనే కోరుకుంటాము. ఎ.పి, తెలంగాణ సి.జె ల బదిలీల వల్ల రాజధాని కేసులు, సిబిఐ ఆలస్యం కావచ్చు గాని తర్వాత కూడా హైకోర్టు వ్యవస్థ న్యాయ ప్రక్రియ మారేవి కావు. కనుక అదేదో తప్పు జరిగిపోతుందన్నట్టు, అది కూడా ఒక న్యాయమూర్తి చెప్పడానికి అవకాశం లేదు. జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ యాభై అయిదు పేజీల తీర్పులో ఇలాంటి పొంతన లేని విషయాలు చాలా వున్నాయి. జస్టిస్‌ రాకేశ్‌ తోటి న్యాయమూర్తుల పైన తీవ్ర ఆరోపణలు చేసి హుటాహుటిన శిక్షణా చర్య తరహాలో ఎ.పి కి బదిలీ అయ్యారు. వీటిని వ్యక్తిగతంగానో, రాజకీయంగానో గాక రాజ్యాంగ పరంగానూ న్యాయసూత్రాల రీత్యానూ మాత్రమే చూడవలసి వుంటుంది.
                                                         

                                                       వేగంగా సరైన న్యాయం
   మొత్తంపైన చెప్పాలంటే హైకోర్టును టిడిపి, వైసిపి రాజ కీయ వివాదాలకు ఒక వేదిక లాగా చిత్రిస్తూ దాని ఆదేశాలు, తీర్పులకు కూడా మీడియాలో అతిగా కథనాలు ఇవ్వడం వల్ల, ముఖ్య నేతలే మాట్లాడటం వల్ల అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై దర్యాప్తు, మాజీ ఎ.జి కి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ ప్రచురణ వంటి ఆదేశాలతో ఇది పరాకాష్టకు చేరింది. మరోవంక తాము చేసేవన్నీ సరైనవైనట్టు, కోర్టు తీర్పులన్నీ తప్పులైనట్టు వైసిపి దాడి చేసింది. ఇది మీడియా, సోషల్‌ మీడియాల లోనూ దుమారం రేపింది. అమరావతిపై రైతుల పిటిషన్లు, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, తెలుగు మీడియంకు స్వస్తి వంటి అంశాలలో కోర్టులు చెప్పినవన్నీ తప్పు కాదు. 'బిల్డ్‌ ఎ.పి' పేరిట 'సెల్‌ ఎ.పి' అంటూ స్థలాలు బేరానికి పెట్టడం కూడా సరికాదు. ఆ అంశం తేల్చే బదులు ఈ కేసు ఎక్కడికో వెళ్లిపోయింది గనకే ఇంత వివాదం ఏర్పడింది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్లినప్పుడు జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వనవసరం లేదని పై తీర్పు వచ్చిన రోజునే జస్టిస్‌ దేవానంద్‌ మరో మంచి తీర్పునిచ్చారు. స్థానిక ఎన్నికలపై కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది, ఇంతకుముందే చెప్పినట్టు రాజ్యాంగ వైఫల్యం విచారణపైనా స్టే ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ ప్రచురణను నిలిపేసే తొక్కివేత ఉత్తర్వులను నిలుపు చేసింది. ఇలాంటి ఉదాహరణలు ఇంకా వున్నాయి. కాని సుప్రీంకోర్టు లోనూ రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగిలిన సందర్భాలు చాలా వున్నాయి. గతంలోనే ఈ శీర్షికలో రాసినట్టు న్యాయపరమైన అంశాలను న్యాయస్థానాలలో మాత్రమే పరిష్కరించుకోవలసి వుంటుంది. ఇప్పుడు ఈ తాజా తీర్పు వివాదం పైనా ఎలాగూ సుప్రీం కోర్టుకు వెళతామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ప్రకటించారు గనక అక్కడే తేల్చుకోవలసి వుంటుంది. స్వభావం వేరైనా దేశంలో న్యాయ వ్యవస్థలో వస్తున్న కుదుపులకూ ఎ.పి లో పరిణామాలకు సంబంధం లేదని చెప్పలేము. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాశారు గనక, దానిపై ప్రధాన న్యాయమూర్తి చర్యలు ప్రారంభించారు గనక త్వరితంగా ఒక ముగింపునిస్తారని ఆశించాలి. ఏది ఎలా వున్నా అమరావతి సమస్యతో సహా అన్ని అంశాలలో ప్రజలకూ రాష్ట్రానికీ న్యాయం జరగాలి. పాక్షిక రాజకీయాలు, తక్షణ ప్రయోజనాలు గాక ప్రజాస్వామ్య హక్కులు, సమ న్యాయం, లౌకికతత్వం, రాజ్యాంగ విలువలు రక్షించబడటం కీలకం. న్యాయ వ్యవస్థ, న్యాయవాద వ్యవస్థ కూడా లోపలి నుంచి బయటి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నదనీ... రాజకీయంగా, సామాజికంగా, మతపరంగా చీలిపోయి స్వతంత్రత కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్‌ జోసఫ్‌ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గుర్తు చేసుకోవడం అవసరం.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి