ప్రజాశక్తి-తెనాలి : ఎడతెరిపి లేని భారీ వర్షాలకు పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఖరీఫ్ ప్రారంభంలోనే వరుసగా రెండుసార్లు పొలాలు ముంపుకు గురవడంతో వెద పద్ధతిలో వరి సాగుకు శ్రీకారం చుట్టిన రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రబీలో జొన్న, మొక్కజొన్న పరిహారమే దక్కని రైతులు, ఖరీఫ్‌లోనూ నష్టాలు తప్పడం లేదని తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఖరీఫ్ రైతులకు తీవ్ర వేదననను మిగిల్చింది. వరి సాగు చేస్తున్న రైతులు అధిక శాతం వెద పద్ధతిని ఎంచుకున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం దాదాపుగా తెనాలి మండలంలో 1852 ఎకరాల్లో ఇప్పటికే వెద పద్ధతిలో వరి సాగు చేశారు. అయితే ఈ పొలాల్లో భారీగా నీరు చేరడంతో వరి మొలకెత్తే పరిస్థితి లేదని, కొన్ని పొలాల్లో మొలకలు కూడా ఉరకెత్తిపోతాయని రైతులు చెబుతున్నారు. దాదాపు 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికే ఒక దఫా పొలాలు ముంపుకు గురయ్యాయి. వర్షపు నీరు బయటకు పోయిన తరువాత మరోమారు కొందరు రైతులు వెద పెట్టారు. ఇప్పుడు అదికూడా నీటిపాలైంది. ఇప్పటికే కొందరు ఎకరానికి దాదాపు రూ.8 నుంచి రూ.10 వేల వరకు వెచ్చించగా, రెండు సార్లు వెద పెట్టిన రైతులు దానికి రెట్టింపు వెచ్చించారు. అంతా నీటిపాలైందన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రబీలో జొన్న మొక్కజొన్న చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలకు పంట తడిసిపోయింది. అధికారులు తూతూ మంత్రంగా పరిహారం అంచనా వేశారు. దానికి సంబంధించి పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతున్నా రైతుల ఖాతాల్లో మాత్రం జమకాలేదని, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించినా సరైన సమాధానం లేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌లోనూ మరలా దెబ్బతినటం రైతులకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు..
వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పట్టణ పరిసర ప్రాంతాల్లో రోడ్లు దీర్ఘకాలికంగా మరమ్మతులకు నోచక అస్తవ్యస్తంగా ఉండగా తాజా వర్షాలతో తెనాలి-సిరిపురం మార్గంలో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. నందివెలుగు-గుంటూరు మార్గంలోనూ కొలకలూరు జూబిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద, కొలకలూరు కూడలి, ఖాజీపేట కూడలిలో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడ్డాయి. గోతుల్లో వర్షపు నీరు చేరింది. దీంతో గోతులు అర్ధంకాక వాహన చోదకులు ప్రమాదాలకు గురౌతున్నారు. కార్లు అయితే గోతుల్లో పడి బంపర్లు, సంపు దెబ్బతిని వాహనాల యజమానులు లబోదిబో మంటున్నారు.
బటన్ నొక్కటమే..ప్రయోజనం లేదు..
మేకల చిట్టిబాబు, కౌలు రైతు, ఐతానగర్
రబీలో జొన్న, మొక్కజొన్న వానపాలైంది. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్న అధికారులు ఏదో తూతూ మంత్రంగా కొనుగోలు చేశారు. దానికి సబంధించి పరిహారం చెల్లింపు అంటూ అనంతపూర్‌లో సిఎం బటన్ నొక్కినా ఇప్పటికీ ఖాతాల్లో సొమ్ము జమకాలేదు. వ్యవసాయ కమిషనర్‌ను కలిసినా కచ్చితమైన సమాచారం లేదు. ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభంలోనే నష్టాలు ఎదురయ్యాయి. జొన్న మొక్కజొన్న పరిహారమే చెల్లించని ప్రభుత్వం ఖరీఫ్ నష్టాన్ని ఏం పరిగణనలోకి తీసుకుటుందో?
రైతులకు నష్టమే
జి.ప్రేమ్‌సాగర్, ఏవో, తెనాలి
ఖరీఫ్‌లో రైతులు వరుసగా రెండుసార్లు నష్టపోయారు. మొత్తంగా తెనాలి మండలంలో ఇప్పటికి 1852 ఎకరాల్లో రైతులు వెద పద్ధతిలో వరి సాగుకు శ్రీకారం చుట్టారు. 15 రోజుల క్రితం భారీ వర్షాలకు వెద పెట్టిన వరి కొన్నిచోట్ల దెబ్బతింది. తిరిగి దుక్కిదున్ని రైతులు మరలా విత్తనాలు చల్లారు. అయినా ఈ వర్షాలకు అదికూడా ముంపుకు గురైంది.










