గుంటూరు పల్నాడు జిల్లాలో ఆదివారం అకాల వర్షం రైతులను మరోసారి దెబ్బతీసింది. వడగళ్ల వాన, ఈదురుగాలులతో పలుచోట్ల మిర్చి, ధాన్యం, మొక్కజొన్న పంటలతోపాటు తోటలూ దెబ్బతిన్నాయి. మరోవైపు పుచ్చ, ఖర్బూజ, బత్తాయి తదితర తోటలూ ధ్వంసమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ ఒకెత్తయితే మిర్చి పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఇద్దరు రైతులు మృత్యువాత పడడం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదిలా ఉండగా గాలుల దాటికి చెట్లు విరిగిపడి ఇళ్లు ధ్వంసం కావడంతోపాటు విద్యుత్ సరఫరా, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రజాశక్తి - ప్రత్తిపాడు:నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కళ్లాల్లోని మిర్చి పంట తడవకుండా కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడినా కొన్నిచోట్ల పంట తడిసింది. గాలుల ఉధృతికి పర్చూరు మార్గంలో హైస్కూల్ దాటిన తర్వాత దాదాపు 10 చెట్లు కూలిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిక్కిరెడ్డిపాలెం గ్రామ పరిధిలోని ఓ షెడ్డుపైన ఉన్న రేకులు ఊడిపోవడంతో దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు. పండ్ల వ్యాపారం చేసే తాను సరుకును ఈ షెడ్డులోనే దాస్తుంటానని చెప్పారు. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల:పట్టణంలో మధ్యాహ్నం 3 గంటల నుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కళ్లంలోని మిర్చిని కాపాడుకోవడానికి పట్టాల కోసం రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖలీల్ దాబా వద్ద నిర్మిస్తున్న హైవే వలన నీరు నిలబడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు గురజాల నియోజకవర్గం పరిధిలోని దాచేపల్లి మార్కెట్ యార్డులో అమ్మకం కోసం రైతులు ఉంచిన ధాన్యం కొంత వర్షం బారిన పడింది. అయితే రైతులు ముందుగానే అప్రమత్తమయ్యారు. రాసిగా ఆరబోసిన ధాన్యాన్ని కూలీల సాయంతో బస్తాల్లోకి ఎత్తారు. ఇప్పటికే సరైన దిగుబడులు లేవని, గతంలోనూ అకాల వర్షం తమను దెబ్బతీసిందని. తాజా వర్షం వల్ల రంగు మారింత ఇంకా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. మొన్నటి వరకూ ధాన్యం బస్తా (75 కిలోలు) రూ.1500-1800 ఉందని, ఇటీవల వర్షం సాకుతో తగ్గించడంతో రైతులు అమ్ముకోకుండా యార్డులో నిల్వ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పంటను కాపాడుకోవడానికి రైతులు నానా అగచాట్లు పడ్డారు.
ప్రజాశక్తి కారెంపూడి:వర్షం ఈదురుగాలులకు మండలంలోని పేటసన్నగండ్ల శివారు పొలాల్లోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫాÛరం పడిపోయింది. మండలంలోని పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడి కరెంటు స్తంభాలు నేలకొరిగాయని, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు సూచించారు. తీగలు తెగి పడిన సమాచారాన్ని అధికారులకు తెలపాలని కోరారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట
నియోజకవర్గంలోని మిర్చి రైతులను వర్షం పరుగులు పెట్టించింది. మిర్చి పంట చివరి కోతలు తడవకుండా కాపాడుకొనేందుకు పట్టాల కోసం రైతులు పరుగులు పెట్టారు. చిరుజల్లుతోనే వాన ఆగిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రజాశక్తి-ఈపూరు:మండలంలోని బొమ్మరాజు పల్లి,భద్రుపాలెం, ఇనిమెళ్ళ గ్రామాలలో ఆదివారం ఈదురుగాలులతో వడగళ్ల వాన కురవడంతో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. వడగళ్ల దాటికి పుచ్చ,ఖర్బూజ కాయలు పగిలిపోయాయి. బత్తాయి,బొప్పాయి, తోటలలో కొమ్మలు విరగడంతో పాటు కాయలు నేలరాలాయి. అలాగే వడగండ్ల వాన ప్రభావంతో మిరప రైతులు నష్టపోయారు. ఇనిమెళ్ళ గ్రామానికి చెందిన గుర్రం వీరాంజనేయులు మాట్లాడుతూ 1.50 ఎకరాలలో పుచ్చ,1.50 ఎకరాలలో ఖర్బూజ సాగు చేశానని చేతికందే సమయంలో వడగండ్ల వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ప్రజాశక్తి దుగ్గిరాల:ఆదివారం ఉదయం 11 గంటల వరకు వాతావరణం మామూలుగానే ఉన్నది. అనంతరం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చాయి, రైతులు చేలోకి వెళ్లే సమయం కూడా లేదు. ఒకసారిగా వర్షం ప్రారంభమైనది. వర్షానికి కండెలకు నష్టం లేదని, అయితే మిషన్ ఆడించిన మొక్కజొన్న విత్తనాలు మాత్రం నష్టపోయే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. వర్షం నుండి పంటను కాపాడుకోవడానికి రైతులు పొలాలకు పరుగులు తీయగా అప్పటికే చేలపై ఉన్న పంట తడిసింది. తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి ఆకాశం మేఘావతమై ఉండడంతో రైతులు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుగ్గిరాల దక్షిణ తూర్పు పొలాల్లో దాదాపు 500 ఎకరాల వరకు మిషన్ ఆడించిన మొక్కజొన్న విత్తనాలు చేలలో ఉన్నాయి. తడి ఆరాలంటే రెండు రోజులపాటు బాగా ఎండలు రావాలని, లేకుంటే మొక్కజొన్నకు బూజుపట్టే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాశక్తి - రొంపిచర్ల:ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచింది. పలుగ్రామాల్లో చెట్లు కూలి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు, రేకులు లేచి పడిపోయాయి. రొంపిచర్ల శివాలయం కాలనీలోని ముక్కడాల నాగేశ్వరరావుకు చెందిన ఇంటిపై రేకులు లేచి పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్యాన్లు విరిగిపోయాయి. ఇల్లు మొత్తం దెబ్బతిని రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. కళ్లాల్లోని మొక్కజొన్న, మిర్చి తడవకుండా రైతులు పట్టాలు కప్పారు.










