May 29,2022 10:06

రాజ్యాంగమా!
నిన్ను తగలబెడుతున్నదేవరో?
అంబేద్కరా! కుల రాజకీయాల్లో
నీ త్యాగాన్ని, చరిత్రను
మట్టుబెడుతున్నదెవరో?
సమానత్వమా! సిగ్గుపడటం తప్ప
నువ్వేమి చెయ్యగలవ్‌?
దళితులారా! చీకటి బతుకుల్లో
క్యాండీ ర్యాలీలు తప్ప
మనమేం చేయగలం?
ఎప్పటికీ కులాధిపత్య శక్తులు
రాక్షసమూకలు ఈ దేశం మీద
అధికార శాసనం చేస్తున్నారు
ఇది లౌకికవాదమని ఎలా చెప్పను?
ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యమేనని
ఎలా అంగీకరించను? అంబేద్కరా!

జాతి నేతను కుల నాయకుణ్ణిగా
దిగజార్చినదెవరో
కుల నాయకుల్ని జాతి నేతలుగా
నిలబెట్టిందెవరో రాజ్యానికి తెలుసు.
దళితులారా! లౌకికవాదులారా!
బహుజనులారా! కులసంఘాల్లారా!
మేధావులారా!
ప్రజాస్వామిక శక్తులారా!
కాస్త మద్దతివ్వండి.
మంటల్లో బూడిదయ్యాక
ఐక్యపోరాటాలేమి చేస్తారుగానీ
మళ్లీ మరొక్కసారి సిగ్గుపడడానికి
మద్దతివ్వండి.
హింస వాడి నైజం
విధ్వంసం వాడి నియమం.
రాజ్యంగా వాడు.
నిత్యబానిసగా మనం!?
తగలబెట్టడం వాడి బాధ్యత
తగలబడటం మాత్రమే మన హక్కు.
రండి మళ్లీ మరొక్కసారి సిగ్గుపడదాం.
ఎప్పటికీ... ఎప్పటికీ మరెప్పటికీ...
మనం ధర్నాలం, మనం ఖైదీలం
కర్ఫ్యూలో కాలిపోవడం
సదా మామూలే.
ఇదో దినచర్య.
మళ్లీ మరోసారి
ప్రగాఢంగా సిగ్గుపడదాం
సిద్ధంగుండండి మాట్లాడుకుందాం!
పేపర్లో ఫొటోలు దాచుకుందాం!
ప్రభుత్వ పదవులకోసం
సాగిల పడదాం
ఈ దేశంలో కంచెలు చేను మేస్తాయి!
గొప్ప ఆలోచనలు
శక్తివంతమైన ఆచరణలు
చరిత్ర సమాధి కింద
అంటరాని కళేబరాల మౌనం!?
ఈ దేశంలో
ఏ అగ్రవర్ణం వాళ్లైనా
అంబేద్కర్‌ సంఘం పెట్టారా?
ఏ కమ్మ, రెడ్డి, కాపు, వెలమ సంఘాలు
అంబేద్కర్‌ ఉత్సవాలు చేశారా?
దహనాలు, దోపిడీలు, హత్యలూ,
అత్యాచారాలు
తప్పుడు కక్షలు, శిక్షలు తప్ప
ఇక్కడ కులం పేరు దేశం !
ఇక్కడ మతం పేరు దేశం !
ఇక్కడ స్వేచ్ఛ పేరు మతం !
ఇక్కడ సమానత్వం పేరు కులం!
తగల బడుతున్న మానవత్వం!
విధ్వంసమౌతున్న మనిషి !
మతం పదిలం! కులం పదిలం !
రాజ్యం పదిలం! రాజకీయం పదిలం !
మనిషి లేడు
ముమ్మాటికీ మనిషి లేడు
ఈ దేశం ఎప్పటికీ వల్లకాడు

శిఖా ఆకాష్‌
93815 22247