Oct 08,2023 20:47

తోటలో డంప్‌ చేసిన ఇసుక

ప్రజాశక్తి - భోగాపురం : తీర ప్రాంతమైన ముక్కాం గ్రామ సమీపంలో నల్ల ఇసుక తరలింపు మళ్లీ మొదలైంది. శనివారం రాత్రి కొంత మంది వ్యక్తులు హేచరీస్‌ సమీపంలోని తోటల్లోకి సముద్రం నుంచి ఇసుకను తరలించి పోగులు వేశారు. దీంతో ఈ సమాచారం తహశీల్దారు బంగార్రాజుకు చేరడంతో ఆయన వెంటనే వీఆర్‌ఒను పరిశీలించాలని ఆదేశించారు. ఈమేరకు వీఆర్‌ఒ శ్రీలక్ష్మి ఆ గ్రామానికి వెళ్లి తోటల్లో ఉన్న పోగులను పరిశీలించారు. ఇటీవలి రెండు నెలలు కిందట ఈ ఇసుక తరలింపు జోరుగా ఉండేది. పత్రికల్లో కథనాలు రావడంతో అక్రమార్కులు వెనక్కి తగ్గారు. మళ్లీ గత రెండు రోజులు నుంచి తరలింపు ప్రారంభించారని గ్రామస్తులు అంటున్నారు. లక్షల్లో ఆదాయం వస్తుండడంతో అక్రమార్కులు మళ్లీ ఇసుక తరలింపునకు తెరలేపారని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక తారస్‌ లారీ లోడుగల నల్ల ఇసుకను సుమారు 5లక్షలకు విక్రయిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో లాభాలు వస్తుండడంతో వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ తరలించడం మొదలు పెట్టారు. గతంలో అయితే ఏకంగా ఈ గ్రామంలో సముద్ర ఒడ్డుకు ట్రాక్టర్లు వెళ్లేలా రహదారిని నిర్మించడం విశేషం. అయితే ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సముద్ర ఇసుకను ఎవరైనా తరలిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని తహశీల్దారు బంగార్రాజు హెచ్చరించారు.