Dec 22,2022 21:42

బిఎఫ్‌-7 ఒమిక్రాన్‌ వైరస్‌ విస్తరణపై ప్రభుత్వం అప్రమత్తం
రోజుకు పరీక్షలు 500కు పెంచిన జిల్లా వైద్యఆరోగ్యశాఖ
ఇప్పటి వరకూ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నిల్‌
గత స్మృతులతో జిల్లావాసులు బెంబేలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

కరోనా కలవరం మళ్లీ మొదలైంది. బిఫ్‌-7 ఒమిక్రాన్‌ వైరస్‌ హెచ్చరికలతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. దీనిపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రెండు జిల్లాలవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు కాలేదు. కరోనా హెచ్చరికల నేపథ్యంలో పరీక్షల సంఖ్యను జిల్లా వైద్యఆరోగ్యశాఖ పెంచింది. మొన్నటి వరకూ ఎవరైనా జ్వర బాధితులు సంప్రదిస్తేనే కరోనా టెస్టులు చేసేవారు. ఇప్పుడు అలాకాకుండా అనుమానితులకు తప్పనిసరిగా టెస్టులు చేస్తున్నారు. గడిచిన రెండురోజులుగా ఏలూరు జిల్లాలో రోజుకు 500 వరకూ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. మళ్లీ కరోనా హెచ్చరికలు జనంలో చర్చనీయాంశంగా మారాయి. గత రెండు దశల్లో కరోనా నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలు గుర్తు చేసుకుని జనం ఆందోళన చెందుతున్నారు. 2020 మార్చిలో మొదటి దశ కరోనా ప్రారంభమవ్వగా 2021 ఏప్రిల్‌లో రెండో దశ కరోనా విజృంభించింది. రెండు దశల్లోనూ జిల్లావ్యాప్తంగా 1,79,788 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా విలయతాండవంతో జిల్లా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెడ్స్‌ దొరక్క, సరైన వైద్యం అందక, ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీని భరించలేక జనం నలిగిపోయారు. కరోనా బారిన పడి అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,121 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే ఆ లెక్కలన్నీ వాస్తవం కాదని తేలిపోయింది. కరోనాతో మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్స్‌గ్రేషియాకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 5,300 వరకూ ఉంది. కరోనా సోకి 14 రోజుల్లోపు మృతి చెందిన వారి కుటుంబాలను మాత్రమే ఎక్స్‌గ్రేషియాకు అర్హతగా తీసుకున్నారు. కరోనా తగ్గి 14 రోజుల తర్వాత డిశ్ఛార్జి అయ్యి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అనేక మంది మృతి చెందారు. ఇటువంటి మరణాలను సైతం లెక్కిస్తే మృతుల సంఖ్య ఆరు వేలుపైనే ఉంటుందని అంచనా. కరోనాతో అప్పట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను అంతా గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ కరోనా హెచ్చరికల నేపథ్యంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. జిల్లాలో దాదాపు అందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. జనాల్లో ఇది కొంత ధైర్యాన్ని నింపుతోంది. కరోనా హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం కొనసాగుతుండటంతో గ్రామాల్లో అనుమానితులు ఉంటే వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కోవిడ్‌ పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌లో ఉంచడం, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి టెస్టులు నిర్వహించడం, కోవిడ్‌ ప్రొటోకాల్‌ కొనసాగించడం, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడం వంటివి చేయాలని ప్రభుత్వం నుంచి వైద్యఆరోగ్య శాఖాధికారులకు ఆదేశాలు అందాయి.
పండుగ సీజన్లలో అప్రమత్తతే కీలకం
రానున్న నెల రోజుల వ్యవధిలో ముఖ్యమైన వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 25న క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు, జనవరిలో సంక్రాంతి పండుగ జరగనుంది. ఈ వేడుకల్లో పెద్దఎత్తున జనం ఒకచోట చేరనున్నారు. సంక్రాంతికి విదేశాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారంతా సొంతూళ్లకు రానున్నారు. దీంతో కరోనా విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వేడుకల సమయంలో జనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో ఇబ్బంది పడితే వెంటనే వైద్యులను కలవాలని, సొంత వైద్యం వద్దని చెబుతున్నారు. కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో జనంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం సైతం ప్రభుత్వంపై ఉంది.