ప్రజాశక్తి - సాలూరు : రానున్న ఎన్నికల్లో వైసిపి మళ్లీ అధికారంలోకి రాకపోతే ప్రజలకు నష్టమని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. ఆదివారం స్థానిక శివాలయం వీధిలో ఉన్న సీతారామ ధర్మశాలలో జగనన్న ఆరోగ్య సురక్షపై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశం లో ఆయన మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పేదల ఇంటికే వైద్య సేవలు అందే అవకాశం ఉందన్నారు. నిపుణులైన వైద్యులు గ్రామాల్లో నిర్వహించనున్న శిబిరాల్లో వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. కావున పేదలంతా వినియోగించుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఈనెల 9న రాజధానిలో నిర్వహించనున్న సమావేశానికి పార్టీకి చెందిన సర్పంచ్‌లు ఎంపిటిసి సభ్యులు జడ్పీటీసీ లు,ఎంపిలు, జెసిఎస్ కన్వీనర్‌లు, సచివాలయం కన్వీనర్లు, మున్సిపల్ చైర్మన్లు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్ లు జర్జాపు దీప్తి వంగపండు అప్పలనాయుడు వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, మక్కువ జెడ్పీటీసీ శ్రీనివాసరావు నాయుడు, సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల వైసిపి అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీనివాసరావు, రంగు నాయుడు, జి.ముత్యాలు నాయుడు, ఎంపిపి ప్రమీల, వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, మెంటాడ ఎంపిపి ఈశ్వరరావు పాల్గొన్నారు.
సువ్వాడ రామకృష్ణ అలక
మండల వైసిపి అధ్యక్షుడిగా సువ్వాడ భరత్ శ్రీనివాసరావును పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆ పదవిని ఆశించిన మాజీ వైస్ ఎంపిపి సువ్వాడ రామకృష్ణ అలక వహించినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు ఆయన హాజరు కావడం లేదు. శనివారం మండలంలోని అన్నంరాజువలసలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో డిప్యూటీ సీఎం రాజన్నదొరతో సహా ముఖ్య మండల నాయకులు పాల్గొన్నారు. అలాగే ఆదివారం సాలూరు పట్టణంలోని నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి కూడా సువ్వాడ రామకష్ణ గైర్హాజరయ్యారు. సువ్వాడ భరత్ శ్రీనివాసరావు యువకుడు విద్యావంతుడు కావడంతో అధిస్థానం ఆయన పేరును మండల పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేసింది. వివాదరహితుడైన నాయకుడిగా ముద్రపడిన సువ్వాడ రమణ కొంత కాలం వైసిపి మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కుమారుడైన భరత్ శ్రీనివాసరావుకే మండల పార్టీ నాయకత్వం అప్పగించాలని మెజారిటీ నాయకులు సిఫార్సు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆయన పేరునే ఖరారు చేశారు.










