Apr 26,2023 00:20

కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బివి.రాఘవులు

ప్రజాశక్తి -యంత్రాంగం
ఆరిలోవ :
గుండెపోటుతో ఈ నెల 19న మృతిచెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు వి.కృష్ణమూర్తి కుటుంబాన్ని మంగళవారం ఆరిలోవలోని వారి ఇంటి వద్ద సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పరామర్శించారు. కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణమూర్తి భార్య అన్నపూర్ణను, కుమార్తె శార్వాని, కుమారుడు మోహన్‌, అల్లుడు కృష్ణ, కోడలు లావణ్య, మనవులు, మనవురాళ్ళను పరామర్శించి, ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణమూర్తి మృతి సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని చెప్పారు. తాను సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శిగా ఉన్న సమయంలో కృష్ణమూర్తితో ఎంతో అనుబంధం, సాన్నిహిత్యం ఉండేదని తెలిపారు. ఆరిలోవ కాలనీ ప్రారంభంలో అనేకసార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి మౌళిక వసతుల కల్పన కోసం కృష్ణమూర్తితో కలిసి కృషి చేశామని తెలిపారు. కృష్ణమూర్తి నిబద్ధత కలిగిన కార్యకర్త అని, అతనికి ఏ బాధ్యత అప్పగించినా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా నిర్వహించేవారని తెలిపారు. పార్టీ కార్యాలయంలో అకౌంట్స్‌ నిర్వహణను క్రమశిక్షణగా నిర్వహించారని కొనియాడారు. కృష్ణమూర్తి మరణం వారి కుటుంబానికే కాకుండా కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుకు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఆరిలోవ జోన్‌ కార్యదర్శి వి.నరేంద్రకుమార్‌, నాయకులు బి.సూర్యమణి, ఎస్‌.రంగమ్మ, భూలోకరావు, కె.సత్యనారాయణ, వి.తులసిరావు, ఐసి.నాయుడు, సుందరయ్యనగర్‌ గ్రామ సంఘం నాయకులు అప్పలనాయుడు, వై.అప్పారావు, సూర్యనారాయణ, రాఘవులతో పనిచేసిన డేవిడ్‌ నాగేశ్వరరావు, రమణ తదితరలు పాల్గొన్నారు.
అనకాపల్లి : సిపిఎం సీనియర్‌ నాయకులు కామ్రేడ్‌ మళ్ల సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని మంగళవారం సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వేర్వేరుగా పరామర్శించారు. సత్యనారాయణ భార్య సరోజినీ, కుమారులు డాక్టర్‌ జగదీష్‌, సుందర వాసులను ఓదార్చారు. వారి వెంట సిపిఎం సీనియర్‌ నాయకులు ఎ.బాలకృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ శంకర్రావు, జి కోటేశ్వరరావు, బి ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు.