ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
మలేరియా, డెంగీ వంటి జ్వరాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.సృజన వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులతో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రాణాంతకమైనవని తెలిపారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. మలేరియా, డెంగీ వంటి జ్వరాలను కలుగజేసే దోమలు తాగునీటిలో మాత్రమే గుడ్లు పెడతాయన్నారు. టైర్స్, కొబ్బరి చిప్పలు, వాడని ఎయిర్ కూలర్లలో నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెట్టడం వల్ల ఈ వ్యాధులు వస్తాయని తెలిపారు. వీటిని ఇంటి పరిసరాల్లో లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారమూ నీటి నిల్వలను ఖాళీ చేసి, ఆరబెట్టి, నీటి నిల్వల మీద మూత ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలమయినా అక్కడక్కడ కేసులు ఉన్నాయని, వర్షాలు పడితే కేసులు పెరిగే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్, పంచాయతీ రాజ్, ఐసిడిఎస్, విద్య, గ్రామీణ నీటి సరఫరా, సంక్షేమ శాఖల అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముద్రించిన కరపత్రాలను సచివాలయాలు, వాలంటీర్లు, అంగన్వాడీ, ఆశా, గ్రామ, మండల స్థాయి అధికారుల ద్వారా ఇంటింటికీ చేర్చి పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామగిడ్డయ్య, జిల్లా టిబి నివారణ అధికారి డాక్టర్ భాస్కర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ నూకరాజు పాల్గొన్నారు.
మలేరియా నియంత్రణపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు










