
ప్రజాశక్తి-మంగళగిరి : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా చేనేత కార్మికులకు 50 శాతం మజూరీ పెంచాలని కోరుతూ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో వందలాదిమందితో శనివారం ప్రదర్శన చేశారు. పాత మంగళగిరి కళ్యాణమండపం నుండి ప్రదర్శన బయలుదేరి హుస్సేన్ కట్ట, మిద్ది సెంటర్, సాదు సోడా సెంటర్ మీదగా షరాఫ్ బజార్‌లోని మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం అసోసియేషన్ కార్యదర్శి ఆర్.శివసత్యనారాయణకు వినతి పత్రం ఇవ్వగా అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి మజూరి పెంపుదలపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పి.బాలకృష్ణ మాట్లాడుతూ చేనేత కార్మికులకు మజూరి ఒప్పంద కాలం ఈనెల 19వ తేదీతో ముగుస్తుందని చెప్పారు. ఈ కాలంలో నిత్యవసర సరుకులు ధరలు 100 శాతం పెరిగి కార్మికుల కుటుంబాలు గడవడం కష్టమవుతోందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు పి.నాగేశ్వరరావు, ఆర్.పూర్ణచంద్రరావు, జి.ధనుంజయరావు, జెవి సుబ్బారావు, బి.బాలతేడేరు, బి.మోహన్‌రావు, కె.కోటేశ్వరరావు, వి.దుర్గాప్రసాద్, డి.రామారావు, ఎస్.నరసింహారావు పాల్గొన్నారు.