May 21,2023 00:55
ఇంకొల్లు అక్కసాని కుంటలో పూడిక తీస్తున్న కూలీలు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: కార్మికులు పోరాడి సాధించుకున్న మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మండుటెండలో కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వేసవిలో ఇవ్వాల్సిన మజ్జిగ లేదు. మంచి నీళ్లూ లేవు. ఉడికిపోతున్న ఉక్కలో కూడా ఉపాధి కూలీలు వడబడిపోతున్నారు. 47 డిగ్రీల ఎండలో కూడా కూలి కోసం పాట్లు తప్పటం లేదు. వ్యవసాయ ప్రాంతం కావటంతో పాటు ఈ ఏడాది అంతా అకాల వర్షాలతో నష్టం రావటంతో కూలీలంతా ఉపాధి పనులపైనే ఆధారపడి ఉన్నారు. ఇంకొల్లు మండల కేంద్రంలోని అక్కసానికుంటలో 250 మంది ఉపాధి కూలీలతో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. కేవలం 150 మంది కూలీలు మాత్రమే పనులకు హాజరై పని చేస్తున్నారు. పని చేసే కూలీలకు భధ్రత కల్పించటంలో అధికారులు, ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలీలకు న్యాయపరంగా రావాల్సిన హక్కులను కల్పించాలని కోరుతున్నారు.
ఎండలో తప్పని తిప్పలు: రామకృష్ణ, కూలీ, ఇంకొల్లు
వ్యవసాయ పనులు లేక ఉపాధి పనులు చేసేందుకు ముందుకు వచ్చాము. యువకులమైన మేము ఎండలో పని చేయలేక పోతున్నాము. పెద్దవారి పరిస్థితి చెప్పలేనిది. ఈ పని కూడా లేకపోతే మేము ఎలా బతకాలి. మాకు భద్రత కల్పించి, సౌకర్యాలు కల్పించాలి.