Sep 01,2023 23:16
జిల్లా పోలీస్‌ అధికారులతో వర్చువల్‌ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నిందితులు చట్టం నుంచి తప్పించుకోకుండా సమర్థవంతంగా కోర్టు ట్రయిల్‌ మానిటరింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. మిస్సింగ్‌ కేసుల విచారణ వేగవంతం చేయాలని అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో 2022 సంవత్సరంలో నమోదై ఇంకా విచారణ దశలో వున్న మిస్సింగ్‌ కేసుల గురించి, ఈ నెల 9న జరగనున్న మెగా లోక్‌ అదాలత్‌లో రాజీ చేయదగ్గ కేసుల గురించి, మహిళలపై జరిగిన నేరాలలో నిందితులకు శిక్షలు పడేవిధంగా తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా పోలీస్‌ అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ పి మహేష్‌, బాపట్ల, చీరాల, రేపల్లె డిఎస్‌పిలు టి వెంకటేశ్వర్లు, ఎస్‌ ప్రసాద్‌రావు, టి మురళీకృష్ణ, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్‌ పి బాల మురళీకృష్ణ పాల్గొన్నారు.
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
పోలీస్‌ శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీస్‌ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ శాఖలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం, ఇతర కారణాలతో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే తనను నేరుగా కలవచ్చునని, తప్పకుండా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ పి మహేష్‌, ఏఓ ఎంఎఫ్‌ రహమాన్‌, ఏఆర్‌ డిఎస్‌పి ఎండిహెచ్‌ ప్రేమ్‌ కుమార్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఐ బి శ్రీకాంత్‌ నాయక్‌ పాల్గొన్నారు.