ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
మిస్టరీని చేధించిన పిఎం.పాలెం పోలీసులు
ప్రజాశక్తి -పిఎం పాలెం: ప్రియుడితో కలిసి భర్తను చంపి, కనిపించడం లేదంటూ పిఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన మధురవాడ మారికవలస వద్ద చోటు చేసుకుంది. భార్య ఇచ్చిన మిస్పింగ్ కేసును చేధించిన పోలీసులు, అది మిస్పింగ్ కాదు మర్డర్ అని తెల్చారు.
పిఎంపాలెం పోలీసులు వెల్లడించిన వివరాలవి. రెండు రోజులు క్రితం మారికవలస జాతీయ రహదారిపై బ్రిడ్జి కింద గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు,. కొద్దిరోజుల క్రితం పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసులోని వ్యక్తిగా గుర్తించారు..ఈ కేసుపై గోప్యంగా విచారణ చేపట్టిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మధురవాడ రిక్షా కాలనీకి చెందిన బుడుమూరు మదుల, తన భర్త బుడుమూరు మురళి (43) తప్పిపోయినట్లు ఈనెల 17న పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈస్ట్ ఆఫ్రికాలో ఇరిట్రియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మురళి, ఈనెల 9న విశాఖ చేరుకుని రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు.11వ తేదీన శ్రీకాకుళం జిల్లా పిల్లలవలసలోని తన తల్లిని కలిసేందుకు బయలుదేరాడని, తానే అయననుకొమ్మాది ఎస్.టి.బి.ఎల్. థియేటర్ వద్ద దించానని, ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ భార్య మృధుల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కానీ మృధుల తన భర్తను 10వ తేదీన రాత్రే ప్రియుడితో కలిసి చంపేసిందని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.మృధుల ఫోన్ కాల్‌డేటా ఆధారంగా ఎక్కువసార్లు మాట్లాడిన ఆమె ప్రియుడు శంకర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. సిసి కెమెరా ఫుటేజీలోనూ భర్త శవాన్ని 10న రాత్రి బైక్‌పై ప్రియుడితో కలిసి మారికవలస బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చినట్లు గుర్తించారు. బ్రిడ్జి కింద పడేసిన మృతదేహాన్ని మూడు రోజుల తర్వాత వెళ్లి కాల్చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిందని సిఐ ఎ.రవికుమార్ తెలిపారు.










