ప్రజాశక్తి- అరకులోయ రూరల్:నిస్సహాయ స్దితిలో ఉన్న పిల్లల పాలిట మిషన్ వాత్సల్య వరం వంటి పథకమని అల్లూరి జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ డాక్టర్ బాకా లవకుశ అన్నారు. మండలంలోని లోతేరు పంచాయతీ సంతలో సిఆర్పీఎఫ్ ఆధ్వర్యాన శనివారం మిషన్ వాత్సల్య పధకంపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లీతండ్రి లేని పిల్లలు లేదా విడాకులు తీసుకున్న 1 సంవత్సరం నుండి 18 సంవత్సర లోపు ఉన్న అనాథ, నిర్భాగ్య పిల్లలను ఆదుకోవడానికి ఈ పధకం ద్వారా ఆర్థిక మేలు కలుగుతుందన్నారు. బాలబాలికలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయక్తంగా మిషన్ వాత్సల్య పధకాన్ని నూతనంగా ప్రవేశ పెట్టాయన్నారు.ఈ పధకం కింద అర్హులైన వారికి ప్రతినెలా రూ.4వేలు అందజేయనున్నారన్నారు. ఈ పథకంలో చేరాలనుకొనేవారు గ్రామీణ ప్రాంత వాసులకు వార్షికాదాయం రూ.72 వేలు, పట్టణ ప్రాంతల వాసులకు రూ.96 వేలు మించరాదన్నారు. అర్హులైన బాలబాలికలు ఈ పథకానికి వినియోగించు కోవాలని కోరారు. ఈ పథకంపై సిఆర్పిఎఫ్ విస్తతంగా ప్రచారం నిర్వహిస్తుందన్నారు. ఈనెల 15లోపు దరఖాస్తులు సంబందిత కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇందుకు సంబంధించి దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఐసిడిఎస్, సిడిపిఒ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుబ్భాయి కళావతి, వైసీపీ నాయకులు శ్రీరామ్, ఆశ వర్కర్లు, అంగన్వాడిలు, ఆయాలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.










