ప్రజాశక్తి-ఆదోనిరూరల్
దరఖాస్తులను స్వీకరించడానికి కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండడం లేదు. మిషన్ వాత్యల్స పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా స్పాన్సర్‌షిప్ కార్యక్రమంలో అనాథ బాలలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అనాథ బాలలకు విద్య, ఆరోగ్యం, అభివృద్ధి అవసరాలకు ఉపయోగపడేలా మిషన్ వాత్యల్స పథకాన్ని రూపొందించారు. మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 26 చివరి తేదీగా ప్రకటించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారులను ఆర్థికంగా ఆదుకోవడానికి, కుటుంబ ఆర్థిక పరిస్థితికి ఉపయోగపడేలా ఆర్థిక సహాయం అందిస్తారు. స్పాన్సర్‌షిప్ ద్వారా ఎంపికైన పిల్లలకు నెలకు రూ.4 వేలు చెల్లిస్తారు. ఈ నెల 26 చివరి తేదీ కావడంతో ఐసిడిఎస్ రూరల్ ప్రాజెక్ట్ కార్యాలయానికి దరఖాస్తుదారులు తరలివచ్చారు. కార్యాలయంలో ఐసిడిఎస్ సిడిపిఒ, సూపర్‌వైజర్లు అందుబాటు లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందారు. దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండి తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కనీసం తాగునీరు, కుర్చీలు కూడా లేకపోవడంతో దరఖాస్తుదారుల బంధువులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. అధికారులు స్పందించి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులను, తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కార్యాలయం ముందున్న దరఖాస్తుదారులు










