Oct 31,2023 23:25

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి అనాధ చిన్నారులను ఆదుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'మిషన్‌ వాత్సల్య అందని ద్రాక్షేనా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ పథకం కోసం అభాగ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులకు సాయం అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. అర్హుల నుంచి దరఖాస్తులు సేకరించి ఎనిమిది నెలలు గడుస్తున్నా మిషన్‌ వాత్సల్య పథకం నేటికీ ఆచరణలో అమలుకు నోచుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఈ స్థితికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాతా శిశు సంరక్షణ శాఖ (ఐసిడిఎస్‌) ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి నుంచి మిషన్‌ వాత్సల్య దరఖాస్తులు స్వీకరించారు. మేలో జిల్లా అధికార యంత్రాంగం హడావుడిగా జాబితా సిద్ధం చేసి రాష్ట్ర కేంద్రానికి అందించింది. ఈ పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 6446 మంది తల్లి,దండ్రులు లేని అభాగ్యులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి నిధుల కోసం కేంద్రానికి సిఫారుసు చేయాలి. దీనిపై ఐదు దశల్లో ప్రాథమిక కసరత్తు పూర్తి చేసి జిల్లా యంత్రాంగం రాష్ట్ర కేంద్రానికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మరోవైపు ప్రతి నెల ఆర్థిక సహాయం వస్తుందన్న ఆశతో బాధిత బాలలు నిరీక్షిస్తున్నారు.
అర్భాటంగా పథకం ప్రకటన
తల్లిదండ్రులను కోల్పోయినా, తల్లి లేదా తండ్రి లేకున్నా, విడాకులు పొందిన దంపతుల పిల్లలు, తండ్రి కుటుంబాన్ని విదిలేసిన వారికి, తల్లిదండ్రులు ప్రాణాపాయ వ్యాధుల బారిన పడినా, ప్రకృతి వైపరీత్యాలకు గురైన బాలలు మిషన్‌ వాత్సల్యకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి వారికి 18 ఏళ్లు నిండే వరకు నెలకు రూ. 4 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించింది. మహిళా పోలీసు, అంగన్‌వాడీ, ఆశాల సమన్వయంతో క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరించారు. తొలుత గడువు తేదీ నాటికి దృవపత్రాల అందుబాటులో లేని కారణంగా అర్హులు సైతం దరఖాస్తులు చేసుకోలేకపోయారు. అనతరం గడవు తేదీ పొడిగించడంతో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వాత్సల్య పథకం ద్వారా లబ్ధి పొందే వారికి ప్రభుత్వం నుంచి ఇతర ఎలాంటి పథకాలు పొంది ఉండరాదని ఉన్నతాధికారుల నుంచి తాజాగా ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 13 వేలు అందుకుంటున్న వారిని వాత్సల్య పథకం నుంచి తొలగించాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. దీంతో ప్రజలు, ప్రజాసంఘాలు పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. మిషన్‌ వాత్సల్య పథకం ప్రారంభించి అభాగ్యులను ఆదుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో అనాథలు ఎంతమంది ఉన్నారన్న దానిపై స్పష్టత వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తులు స్వీకరించి నెలల గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలురాలేదని తెలుస్తోంది. దీంతో అనాథ పిల్లలు ఆ పథకం లబ్ధికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఐసిడిఎస్‌ పీడీని వివరణ కోరగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి ఉన్నతాధికారులకు అందజేశామని తెలిపారు. అర్హులందరికీ మిషన్‌ వాత్సల్య పథకం అందేలా చూస్తామని వివరించారు.