Oct 16,2023 22:36


ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
మహిళల భద్రత సాధికారత నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌శక్తి కార్యక్రమంలో సంబంధిత శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు ఐసిడిఎస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన మిషన్‌శక్తి కార్యక్రమం అమలుకు సబంధించి సంబంధితశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా జాయింట్‌ మాట్లాడుతూ మిషన్‌శక్తి కార్యక్రమం కేంద్ర మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వశాఖచే మహిళల భద్రత, సాధికారత నిమిత్తం అమలు చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఈకార్యక్రమంలో సంబల్‌, సామర్ధ్య అనే రెండు ఉపపథకాలు మహిళల సాధికారత భద్రత కోసం ఉన్నాయని తెలిపారు. అలాగే బేటి బచావో బేటి పడావో కార్యక్రమంను సవరించి మిషన్‌శక్తిగా అమలు చేయడం జరుగుతున్నదని తెలిపారు. మహిళల సాధికారతతోపాటు బాల్యవివాహాలను నిర్మూలించేందుకు జిల్లాలో ఏఏ మండలాలలో బాల్యవివాహాలు జరుగుతున్నది సర్వే జరిపి వీటి నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. మిషన్‌శక్తి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు డివిజన్‌ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలను సంబంధితశాఖల సమన్వయంతో నిర్వహించాలని పిడి నాగ శైలజను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్యలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ బాష, హౌసింగ్‌ పీడీ పద్మనాభం, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్‌, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, అధికారులు ఆవిష్కరించారు.