బెలగాం: మిషన్ ఇంద్ర ధనుష్ టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు అన్నారు. సోమవారం నుండి శనివారం వరకు జిల్లా వ్యాప్తంగా జరగబోయే మిషన్ ఇంద్ర ధనుష్ రెండో దశ టీకా కార్యక్రమానికి సంబందించిన ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వైద్య సిబ్బంది వేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా షెడ్యూల్ ప్రకారం గతంలో ఏవైనా కారణాల వల్ల టీకా వేయబడని పిల్లలను సర్వేలో గుర్తించి ప్రస్తుత కార్యక్రమంలో టీకా పూర్తి చేస్తారన్నారు. వీరితో పాటుగా ఈ వారం షెడ్యూలు ప్రకారం టీకా అర్హులు కూడా ఉంటారన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో ఉన్న 37 పిహెచ్‌సిలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 560 టీకా కేంద్రాల్లో 1332 మంది పిల్లలకు, 339 మంది గర్భిణీలకు టీకా వేయనున్నట్టు తెలిపారు. టీకా పూర్తి చేసిన వివరాలన్నీ కొత్తగా చేర్చిన యూవిన్ పోర్టల్‌లో ఆన్లైన్ నమోదు చేస్తారని, ఈ విధానం ద్వారా సచివాలయం పరిధిలోనే టీకా ధ్రువ పత్రాన్ని పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే మొదట దశ ఆగస్టులో పూర్తయ్యిందని, ప్రస్తుతం రెండో దశ అని, అక్టోబర్‌లో మూడో దశ ఉంటుందని జగన్మోహనరావు తెలిపారు. టీకా నిర్వహణను బలోపేతం చేసే దిశగా, తట్టు, రుబెల్లా తదితర వ్యాధుల పూర్తి స్థాయి నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ ఇంద్ర ధనుష్ టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.










