
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : మిర్చి యార్డులో రైతుల నుంచి శ్యాంపిల్స్ పేరుతో మచ్చుకాయలు తీసే విధానాన్ని నిరోధించాలని ప్రయత్నించిన చైర్మన్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. మూడునెలల క్రితం బాధ్యతలు చేపట్టిన యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ.. శ్యాంపిల్స్ పేరుతో భారీగా కాయలు తీసుకోవడాన్ని నియంత్రించాలని ఒక ప్రణాళిక రూపొందించారు. ముఠా కార్మికులు, హమాలీల నుంచి వీటిని వెనక్కితీసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం సెక్యూరిటీ గార్డులను కొంతమంది కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వివాదం కొనసాగుతుండగా అదే సమయంలో చైర్మన్ రాజనారాయణ యార్డులోకి ప్రవేశించారు.దీంతో యార్డులో చైర్మన్ కారును ముఠా కార్మికులు చుట్టుముట్టి కదలినవ్వకుండా చేశారు. వెంటనే ఆయన పోలీసులను పిలిపిం చడతో వారు రంగ ప్రవేశంచేసి కార్మికులను పక్కకు లాగేశారు. వెంటనే ఆయన తన కార్యాల యంలోకి వెళ్లారు. మచ్చుకాయలు తీసుకోవడం 40 ఏళ్లుగా కొనసాగుతోందని, రైతుల సమ్మతి తోనే తాము తీసుకుంటున్నామని ముఠా కార్మికులు చెప్పారు. అయితే తనపై కొంత మంది బయటవ్యక్తులు కావాలని దాడి చేయిం చారని, తనను చంపడానికి కుట్ర చేశారని రాజనారాయణ ఆరోపించారు. ముఠా కార్మికుల్లోని కొంత మంది సామాజిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. తమ సామాజిక తరగతికి చెందిన వారు గుంటూరు పశ్చిమలో 10 వేలమంది ఉన్నారని, తమను మచ్చు కాయలను తీసుకోనివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా యార్డు ముఠా కార్మికుల అసోసి యేషన్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి యార్డు చైర్మన్ రాజనారాయణకు మధ్య ఉన్న విభేదాలే ఈ వివాదానికి కారణమని వైసిపి వర్గాల్లో ప్రచారమవుతోంది.