ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా వైసిపి నాయకుడు నిమ్మకాయల రాజనారాయణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. యార్డు గౌరవ చైర్మన్‌గా ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, వైస్ చైర్మన్‌గా షేక్ మాబూ సుభానీ, డైరెక్టర్లుగా పల్లా శ్రీనివాసరావు, మహ్మద్ ఫరూక్, కోటా గంగాభవానీ, కోలా అన్నపూర్ణ, కొండారెడ్డి నాగలక్ష్మీ, కొప్పుల విజయ మాధవి, పి.సుశీల, షేక్ సలీమ, బి.వెంకటేశ్వరరావు, గుంజర ప్రభుదాసు, ఎం.సతీష్‌కుమార్, గుడివాడ అరుణ, కొత్తపల్లి శివసాంబిరెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ భాగ్యలక్ష్మీ నియమితులయ్యారు. నూతన చైర్మన్ రాజనారాయణ, డైరెక్టర్లకు మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, వైసిపి నాయకులు తాడిశెట్టి మురళీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
రాజనారాయణను యార్డు చైర్మన్‌గా మంత్రి అంబటి రాంబాబు సిఎంకు సిఫార్సు చేయగా గుంటూరుకు చెందిన వైసిపి నాయకులు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రక్రియ ప్రభుత్వం ఉత్తర్వుల జారీతో ముగిసింది. వైసిపిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు రెండు గ్రూపులుగా జిల్లా నాయకులు విడిపోతున్నారు. మంత్రి అంబటి రాంబాబు గుంటూరుపై కూడా క్రమంగా పట్టు సాధిస్తున్నారు. గుంటూరుకు చెందిన రాజనారాయణకు ఈ పదవి ఇప్పించడం ద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలో అధికంగా ఉన్న బిసిలను తన వైపునకు తిప్పుకోవాలనే ప్రయత్నంలో మంత్రి అంబటి ఉన్నారు. రాజనారాయణ నియామకాన్ని అడ్డుకోవాలనే అప్పిరెడ్డి గ్రూపు ప్రయత్నాలు విఫలమయ్యాయి.










