ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా వైసిపి రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ నియామకానికి రంగం సిద్ధమైంది. ఏడాదికి రూ.6వేల కోట్ల లావాదేవీలు జరిగే మిర్చి యార్డు చైర్మన్ పోస్టుకు అధికార పార్టీలో డిమాండ్ ఏర్పడింది. 2020 నుంచి మూడేళ్లపాటు చంద్రగిరి ఏసురత్నం కొనసాగారు. ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఈ రెండు నెలలపాటు వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డిని తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగించారు. యార్డు పాలకవర్గం పదవీకాలం మే 25తో ముగిసింది. చైర్మన్‌గా నిమ్మకాయల రాజనారాయణను ప్రతిపాదిస్తూ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఎం వైఎస్ జగన్‌కు సిఫార్సు లేఖలు ఇచ్చారు. సిఎం ఆదేశాలతో రాజనారాయణ చైర్మన్‌గా నియమించాలని సిఎం కార్యాలయ కార్యదర్శి కె.ధనుంజరురెడ్డి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శికి రెండ్రోజుల క్రితం లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి యార్డు పాలక మండలి పదవీ కాలం పూర్తయినందున చైర్మన్ ఒక్కరినే నియమించడం సరికాదని, మొత్తం పాలక మండలిని సిఫార్సు చేయాలని తిప్పి పంపారు. దీంతో రాజనారాయణ చైర్మన్‌గా నియామక ప్రక్రియ తాత్కాలికంగా పక్కనపెట్టారు.
యార్డు పరిధిలోని పొన్నూరు, గుంటూరు పశ్చిమ, తూర్పు, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు డైరెక్టర్లుగా సిఫార్సు చేయాల్సి ఉంది. దీంతో వీరంతా సమావేశం నిర్వహించి డైరెక్టర్లును ప్రతిపాదించాలి. యార్డుచైర్మన్ పదవి మూడేళ్ల క్రితం బిసిలకు కేటాయించగా చంద్రగిరి ఏసురత్నం మూడేళ్లు ఈ పదవిలో ఉన్నందున రొటేషన్‌లో ఈ పదవిని జనరల్ కేటగిరిలో ఓసీలకు ఇవ్వాలని కొంతమంది జిల్లా అధికారులపై వత్తిడి తెచ్చారు. ఈ మేరకు గుంటూరు యార్డు చైర్మన్ పదవిని ఓసీకి ఇస్తారని ప్రచారమవడంతో పలువురు పోటీపడ్డారు. సిఎం కార్యాలయం, వైసిపి రాష్ట్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. ఒకసారి బిసికి కేటాయిస్తే ఐదేళ్లు బిసికి ఉంచాలని మరో గ్రూపు వత్తిడి చేసింది. ఓసీకి కేటాయిస్తే తన నియోజకవర్గం నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ జిల్లా నాయకులను, మంత్రులను కోరారు. రాజనారాయణకు ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు గట్టిగా పట్టుబట్టారు. దీంతో ఆయన సిఫార్సుకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎం జగన్.. రాజనారాయణ నియామకం కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు. కానీ మొత్తం పాలక మండలిని ప్రతిపాదించాలని మార్కెటింగ్ శాఖ సూచించడంతో ఈ నియామక ప్రక్రియ పెండింగ్‌లో ఉంచారు.
నామినేటెడ్ పదవికి ఏడాది పదవీకాలం మాత్రమే కేటాయిస్తుండగా రాజనారాయణను రెండేళ్ల పాటు చైర్మన్‌గా నియమించాలని సిఎం కార్యాలయం అధికారులు సిఫార్సు చేయడం గమనార్హం. డైరెక్టర్ల ఎంపికపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకుల మధ్య సఖ్యత ఏర్పడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే మొత్తం పాలక మండలిని నియమించే అవకా శం ఉంటుందని, అప్పటి వరకు పాలక మండ లి లేనట్టేనని అధికార వర్గాలు తెలిపాయి.










