మిర్చి యార్డ్ ప్రారంభం
- రైతులు సద్వినియం చేసుకోవాలి
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామున్
- మిర్చి క్రయ విక్రయాలు చేపట్టిన అధికారులు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డులో మిర్చి యార్డును జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, యార్డ్ సెక్రటరీ కల్పన తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మిర్చి యార్డును రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ పండించిన మిర్చిని గుంటూరు మిర్చి యార్డుకు ఇక నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, నంద్యాలలోనే అమ్ముకోవచ్చన్నారు. దళరీ వ్యవస్థకు చోటు లేకుండా నేరుగా రైతులే మిర్చి యార్డులో ట్రేడర్ల ద్వారా అమ్ముకోవచ్చని తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 45 వేల ఎకరాల్లో మిర్చి సాగు అవుతుందని అన్నారు. గుంటూరు మిర్చి యార్డ్‌లో 250 రూపాయలు రేటు ఉందని, ఇక్కడ మార్కెట్లో రూ.225 నుండి 285 వరకు పోవడం సంతోషంగా ఉందన్నారు. సోమ, బుధ, శుక్రవారం మూడు రోజులు మిర్చి యార్డులో మిర్చి కొనుగోళ్లు జరుగుతాయన్నారు. మార్కెట్ యార్డ్ సెక్రటరీ మాట్లాడుతూ మిర్చి యార్డ్‌ను ప్రారంభించడంతో అనేక మంది రైతులు మార్కెట్‌ను పరిశీలనకు, మిర్చి ధరల కోసం వచ్చారని, ఇక్కడి పరిస్థితి చూసిన తర్వాత మిగిలిన మిర్చి రైతులు కూడా తమ పండించిన మిర్చిని మార్కెట్‌కు తెస్తామని చెప్పారన్నారు. నేటి నుండి కొనుగోలు పెరుగుతాయని, మార్కెట్‌కు వచ్చే రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంతకు ముందు మార్కెట్‌కు రైతులు తెచ్చిన మిర్చిని కలెక్టర్ పరిశీలించి వేలంపాటను ప్రారంభించారు. దాదాపు 10 మంది రైతులు మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా ముగ్గురు గిట్టుబాటు ధర రాకపోవడంతో మిర్చీని అమ్మలేదు. మిగిలిన రైతులు మిర్చిని అమ్ముకున్నారు. మిర్చి అమ్మకాలు ప్రారంభం రోజు 9 మంది ట్రేడర్స్, కమిషన్ ఎజెంట్లు వేలంలో పాల్గొన్నారు. మొదటి రోజే రూ.200పైన ధర పలకడం బాగానే ఉన్నప్పటికీ తాము తెచ్చిన మిర్చి లోడింగ్ చార్జీల వరకే రైతులకు పరిమితం చేయాలని, కాట, ఆన్ లోడింగ్ చార్జీలు కూడా చెల్లించాలంటే భారం అవుతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.










