ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాలో గతనెలలో నెలకొన్న వర్షాభావం ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులకు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరట నిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈనెల 8వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో రైతుల్లో ఖరీఫ్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రధానంగా వరికి అవకాశం లేకున్నా కనీసం మెట్ట పంటలకు అయినా మేలు జరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, పొన్నూరు, వట్టిచెరకూరు, పత్తిపాడు, తుళ్లూరు, తాడికొండ మండలాల్లో భారీ వర్షం నమోదు అయింది. మిగతా మండలాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. జిల్లాలో సెప్టెంబరులో 145.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా తొలి నాలుగురోజుల కాలంలో 57.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. పల్నాడు జిల్లాలో దుర్గి, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, మాచవరం, అచ్చంపేట, వినుకొండ, చిలకలూరిపేట, యడ్లపాడు మండలాల్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. మిగతా మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో ఈనెలలో 134.5 మిల్లీ మీటర్లకు గాను నాలుగురోజుల్లో 53.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. గతనెలలో మొత్తం 48.7మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. జిల్లాలో ఇప్పటి వరకు ఏ పంట వేయని రైతులు మిర్చి వైపు మొగ్గుచూపు తున్నారు.
భారీ పెట్టుబడి పెట్టలేని వారు కంది,మినుము,పెసర, జొన్న, మొక్కజొన్న వైపు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు తెలిపారు. గురటూరు జిల్లాలో కూడా మెట్ట ప్రాంతంలో ఆరుతడి పంటలవైపు రైతులు అడుగులు వేస్తున్నారు.పత్తి సాగుకు సమయం దాదాపుగా పూర్తి అయింది. మిర్చి సాగుకు చివరి ప్రాంతం అయినపత్తిపాడు, తాడికొండ ప్రాంతాలకు కాల్వల నుంచినీరు వస్తుందన్న గ్యారంటీ లేదు. దీంతో ఆరుతడి పంటల వైపుదృష్టి సారిస్తున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో సేద్యానికి నీరు ఇవ్వలేమని జలవనరుల శాఖ అధికారులు ప్రకటించారు. కేవలర వర్షాధార పంటలు మాత్రమే వేసుకోవాలని చెబుతున్నారు.ఈపరిస్థితుల్లో మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతోమిర్చి రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకు సాగర్ జలాశయంలోనీరు లేకపోవడం వల్ల ఈఏడాది మిర్చిసాగు కూడా ఇంతవరకు ఊపందుకోలేదు. మిర్చికి తప్పని సరిగా రెండు మూడు తడులకు నీటి అవసరం ఉంది. సాగర్ నుంచి నీరురాకపోతే మిర్చి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. దీంతోరైతులు మిర్చిసాగుకు ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోయారు. వర్షాలు ముమ్మరంగా కురిస్తే మళ్లీ సాగు వైపు రైతులు పరుగులు పెట్టే అవకాశం ఉంది.










