ప్రజాశక్తి - పర్చూరు
ఖరీఫ్ ప్రారంభం నుండి మొన్నటి వరకు వర్షాభావ పరిస్ధితులు వెంటాడుతూనే ఉన్నాయి. ఖరీఫ్ సాగు కోసం పొలాలను సిద్దం చేసుకున్నా వర్షాలు సకాలంలో పడకపోవటంతో అరకొరగానే రైతులు పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, కౌలు భూములకు అధిక ధరలు పలకటంతో ప్రధానంగా కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ ముగుస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోని స్ధితిలో రైతులు ఉన్నారు. పర్చూరు సబ్ డివిజన్ పరిధిలో పర్చూరు, కారంచేడు, యద్దనపూడి, ఇంకొల్లు మండలాల్లో ఖరీఫ్‌లో 45వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా కేవలం 6వేల ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేశారు. వరి 3వేల ఎకరాలు, మిర్చి 1100ఎకరాలు, జూటు 375 ఎకరాలు, మొక్కజొన్న, మినుము 400ఎకరాలు మాత్రమే రైతులు సాగు చేస్తున్నారు. మిగిలిన పంటలు నామమాత్రంగానే సాగయ్యాయి. పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని పర్చూరు, కారంచేడు మండలాలలో 25 వేల ఎకరాల్లో సాగు చేయాల్సి వుంది. గత ఏడాది వైట్ బర్లి పొగాకు, మిర్చి, ప్రత్తికి నాణ్యమైన ధర పలకటంతో అధిక కౌలు చెల్లించి భూములను కౌలుకు తీసుకున్నారు. నేటికి పంటలు వేయకపోవటంతో రైతుల్లో నిరాశ నెలకొంది. వరి సాగు చేసే రైతులకు వ్యవసాయం ప్రారంభం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు లేమి కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా లేకపోవటంతో వరి పంటకు నీరు ఇవ్వలేమని, రైతులు సాగు చేయవద్దని అధికారులు ప్రకటించారు. ఈ నేపధ్యంలో వరి సాగు చేసే రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే సాగు చేసేందుకు నారు సిద్దం చేసుకున్నారు. నారు సిద్దం చేసుకున్న రైతుల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. వరి నాట్లు ఇప్పటికే వేసిన రైతులకు నీరు అందించలేమని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. కారంచేడు, పర్చూరు మండలాలలో సుమారు 30వేల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి వుంది. కొమ్మమూరు కాలువ ద్వారా సాగు నీరు అందాల్సి వుంది. సాగు చేసుకుందామన్న తరుణంలో అధికారులు నీటి పారుదల శాఖ అధికారులు సాగుకు నీరు అందించలేమని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ప్రకటించారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.










