ప్రజాశక్తి - గంపలగూడెం
మండలంలో మిర్చి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మండలంలోని విన గడప గ్రామ రెవెన్యూ పరిధిలో గల నారికంపాడు, జింకల పాలెం గ్రామాల్లో దాదాపు 150 ఎకరాలు సాగుచేసిన మిర్చి వివిధ వ్యాధులతో పూర్తిగా దెబ్బతి న్నదని, దీనితో రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షులు గువ్వల సీతారామరెడ్డి మాట్లాడుతూ, ఈ రెండు గ్రామాలే కాదు మండలంలోని పలు గ్రామాల్లోఈ ఏడాది కల్తీ మిర్చి నారు అమ్మినట్లు తెలిపారు. అందులో భాగంగా గంపలగూడెం మార్కెట్ యార్డు వద్ద గల శ్రీ వెంకటేశ్వర నర్సరీ నందు మిర్చినారుమిర్చి నారు కొనుగోలు చేసి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు పూర్తిగా ఎండిపోయిన మిర్చి మొక్కలతో ఆందోళనకు దిగారు. అనంతరం సంబంధిత వివరాలతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో మండల రైతు సంఘం కార్యదర్శి మద్ది రెడ్డి వెంకటరెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి జానపాటి వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు










