Jan 20,2023 22:41

ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

               నల్ల తామర పురుగు, తెగుళ్లతో నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని పట్టెన్నపాలెంలో నల్ల తామర పురుగు, తెగుళ్లతో మిర్చి పంటకు వాటిల్లిన నష్టాన్ని ఆ సంఘం నాయకులు శుక్రవారం పరిశీలించారు. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, ముసునూరు, ఆగిరిపల్లి, లింగపాలెం, కుక్కునూరు, వేలేరుపాడు తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేస్తున్నారన్నారు. నల్ల తామర పురుగు, వైరస్‌ తెగుళ్లతో మిర్చి పంటకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఎకరాకు రూ.లక్ష 50 వేలకుపైగా రైతులు పెట్టుబడి పెట్టారని తెలిపారు. 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చే మిర్చి దిగుబడి 3, 4 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. తెగుళ్లను రాష్ట్ర విపత్తుగా ప్రకటించి, పంట నష్టాలను నమోదు చేసి పరిహారం ఇవ్వాలని కోరారు. తెగుళ్ల నివారణకు ఉద్యాన శాఖ ద్వారా తగు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, మండల అధ్యక్షులు బోడిక రామచంద్రరావు, రైతు నాయకులు దాసరి మధు, పట్టెన్నపాలెం మాజీ సర్పంచి ఆకుల చల్లారావు, మిర్చి రైతులు గూడుపు శ్రీనివాసరావు, పసుపులేటి లక్ష్మీనా రాయణ, సింగులూరి రాంబాబు పాల్గొన్నారు.