Apr 17,2023 22:10

ఎస్‌పికి ఫిర్యాదు చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతున్న మిర్చి రైతులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : మిర్చి కొనుగోలు చేసిన వ్యాపారులు తమకు డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని మేడికొండూరు మండలం పొట్లపాడుకు చెందిన రైతులు సోమవారం స్పందనలో జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. పొట్లపాడుకు చెందిన 21 మంది రైతులు నుండి గుంటూరులోని అయ్యప్ప చిల్లీస్‌ ట్రేడర్స్‌్‌ వారు 465 బస్తాలను కొనుగోలు చేశారని, ఇందుకుగాను రైతులకు రూ.40 లక్షలు చెల్లించాల్సి ఉందని, సొమ్ము అడిగితే ముఖం చాటేస్తున్నారని రైతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయ్యప్ప చిల్లీస్‌ ట్రేడర్స్‌ తరుఫున బత్తుల నాగేశ్వరరావు అనే మధ్యవర్తి తమ వద్ద మిర్చి కొనుగోలు చేసి రశీదు కూడా ఇచ్చారని, కొన్ని రోజులుగా ఆయన కనిపించడం లేదని రైతు జువ్వాజి నాగభూషణం వాపోయారు. ఈనెల 8,9 తేదీల్లో మిర్చి విక్రయించగా 10వ తేదీన సొమ్ము ఇస్తామని చెప్పినా ఇంకా ఇవ్వలేదని అన్నారు. యజమాని కృష్ణ మాత్రం కాలయాపన చేస్తున్నారని తెలిపారు.