ప్రజాశక్తి-విఆర్.పురం
మిర్చి రైతులకు అధికారులు సహకరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన మిర్చి పంటలను సిపిఎం నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 2022 వరదలు కారణంగా మిర్చి పంటలు ఆలస్యంగా సాగు చేశారన్నారు. పంటను పశువులు నాశనం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలని, లేకుంటే నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. పంట ఆలస్యం కావడంతో ఈ ఏడాది తెగుళ్లు విపరీతంగా రావడంతో పెట్టుబడి కూడా పెరిగిందని తెలిపారు. సుమారు ఎకరాకు రెండు లక్షల, నుండి మూడు లక్షల రూపాయల వరకు రైతులు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులు రైతులకు సరైన సూచనలు చేసి, గిట్టుబాటు ధర వచ్చే విధంగా సహకరించాలని కోరారు. లేకుంటే నష్టాలు చవిచూసి రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి దుస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, రైతు సంఘం మండల కార్యదర్శి వడ్లది రమేష్, పంకు సత్తిబాబు, నాళ్లారపు ప్రకాష్, రైతులు కడుపు రాము, తెలగాని వెంకన్న, బుర్ర శ్రీను, సత్యనారాయణ, అప్పారావు పాల్గొన్నారు.










