May 09,2023 00:31

ఇటీవల వానలకు పెదకూరపాడులో తడిసిన మిర్చి

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో ధరల తగ్గుదల కొనసాగుతోంది. విదేశీ ఆర్డర్లు లేవు.. వర్షాలతో నాణ్యత తగ్గుతుందని వ్యాపారులు అంటున్నారు. నెల రోజులుగా ధరల పెరుగుదల లేదు. సాధారణ రకాలు కనిష్ట ధర క్వింటాళ్‌ రూ.9 వేలు, గరిష్ట ధర రూ.23 వేలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మేలురకాలైన తేజ, బాడిగ, దేవనారు డీలక్స్‌్‌ రకాలు ధరలు కూడా గతనెల కంటే బాగా తగ్గాయి. ఈ రకాల ధరలు కనిష్టంగా రూ.9 వేలు, గరిష్టంగా రూ.23 వేల వరకు ఉన్నాయి. గత నెలలో సాధారణ రకాల కనిష్టంగా రూ.12 వేలు, గరిష్టంగా రూ.27 వేల వరకు పలికాయి. మేలురకాలు కనిష్టంగా రూ.13 వేలు, గరిష్టంగా రూ.30 వేల వరకు పలికాయి. ఎక్కువ సరుకు కనిష్ట ధరలకే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేదనే కారణంతో ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
సోమవారం యార్డుకు 1,00,102 టిక్కీలు రాగా పాత నిల్వలతో కలిపి 96,526 టిక్కీల విక్రయాలు జరిగాయి. ఇంకా 64,054 టిక్కీలు యార్డులో నిల్వ ఉన్నాయి. 334 రకం కనిష్ట ధర రూ.10వేలు కాగా గరిష్ట ధర రూ.22 వేలు, నంబరు-5 రకం రూ.13-16 వేలు, 273 రకం రూ.12-19 వేలు, 341 రకం రూ.10-23 వేలు, సూపర్‌-10 రకం రూ.18,500 ధరలు పలికాయి. తేజ కనిష్ట ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.23,500, బాడిగ కనిష్ట ధర రూ.9300, గరిష్ట ధర రూ.23,500, దేవనూరు డీలక్స్‌ రూ.10 వేలు కనిష్ట ధర కాగా గరిష్ట ధర రూ.20 వేలు పలికింది.
ఈ ఏడాది యార్డులో సీజన్‌ మొదలైన తరువాత గత మూణ్ణెల్లలో రైతులు అకాల వర్షాలు పలుమార్లు వెంటాడాయి. వీటి వల్ల మిర్చి నాణ్యత తక్కువగా ఉందన్న సాకుతో ధరలు తగ్గించారు. నాణ్యత తక్కువగా ఉండటం వల్ల వ్యాపారులు కూడా కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. అంతేగాక విదేశీ ఆర్డర్లు కూడా లేవంటున్నారు. అకాల వర్షాలతో కొంత ఇబ్బంది ఏర్పడగా ధరలు తగ్గుదల వల్ల రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టుబడి ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టినట్టు రైతులు తెలిపారు. కనీసం 15 క్వింటాళ్ల దిగుబడి రావాలని, ధర క్వింటాళ్‌ రూ.20 వేలకు తగ్గకుండా ఉంటేనే కొంత వరకు నష్టాల నుంచి బయటపడతామని రైతులు చెబుతున్నారు. పంట కోత ప్రారంభం నుంచి గత మూణ్ణెల్లుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. పంట తడవకుండా కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. ఇటీవల వర్షాలకు కోతలకు సిద్ధంగా ఉన్న మిర్చి, కోసి కళ్లాల్లో ఆరబోసిన మిర్చి కూడా తడిసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు.