Oct 21,2023 00:16

ట్యాంకర్‌ ద్వారా మిర్చికి నీరు పెడుతున్న రైతులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : సాధారణంగా అక్టోబర్‌లో వర్షాలు కురిసి పైరుతో పొలాలు కళకళలాడతాయి. ముమ్మర వ్యవసాయ పనులలో రైతులు, కూలీలు క్షణం తీరిక లేకుండా గడుపుతారు. కానీ ఈసారి పరిస్థితి తారుమారైంది. వర్షాభావంతో పొలంలోని మొక్కలను బతికించుకోవడానికి రైతులు నానా అవస్థ పడుతున్నారు. అనేక వ్యయ ప్రయాసలకోర్చి నీటిని అందిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ సిబ్బంది డబ్బులు గుంజుతున్నారు.
నరసరావుపేట మండలంలో 35 వేల ఎకరాల సాగు భూమి ఉండగా గతేడాది 3400 ఎకరాల్లో మిర్చి సాగైంది. ఈ ఏడాది వర్షాభావం దృష్ట్యా 1500 ఎకరాలకే పరిమితమైంది. పైరు ప్రస్తుతం 60-80 రోజుల దశలో ఉంది. ఇప్పటికే కొన్ని పొలాల్లో పూత రాగా ఇతర పొలాల్లోనూ మరో నెలలో వస్తుంది. ఈ దశలో పైరుకు నీరు పెట్టకుంటే బెట్టకు రావడంతోపాటు తెగుళ్లు, పురుగులు ఆశిస్తాయి. పూత మొత్తం రాలిపోతుంది. మరో 10 రోజుల్లో వర్షాలు రాకున్నా, మొక్కకు ఎలాగోలా నీరు అందించకున్నా ఆశలు వదులుకోవడమేనని రైతులు చెబుతున్నారు.
అప్పులు చేసి, నానా కష్టాలు పడి సాగు చేసిన పైరును చూస్తూచూస్తూ వదిలేసుకోలేక రైతులు ఆవేదనకు గురవుతున్నారు. మొక్కలకు నీరు పెట్టుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. వర్షాలు లేకపోవడం, కాల్వలకు నీరు రాని నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఒక ఎకరాకు మోస్తరు తడి ఇవ్వాలంటే కనీసం 30 ట్యాంకర్ల వరకు అవసరం. మండలంలోని ములకలూరులో చెరువు (తాగు నీటి అవసరాలకు ఉపయోగించడం లేదు)కు వాగులు, కాల్వల ద్వారా నీరు వస్తుంది. దీన్ని పశువులు, ఇతర గ్రామ అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. ఈ చెరువు నుండి నీటిని పొలాలకు ట్యాంకర్ల ద్వారా తరలించి మొక్కలకు పెడుతున్నారు. ఒక్క ట్యాంకర్‌ నీటిని తరలించడానికి సొంత వాహనం ఉన్న వారికే రూ.800 వరకూ ఖర్చవుతున్నాయి. ఎకరాకు 30 ట్యాంకర్లన్నా అవసరం కాబట్టి రైతు రూ.30 వేల వరకూ అదనపు భారాన్ని భరించాల్సి వస్తోంది. ఈ అవకాశం లేని గ్రామాల్లో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. దీనికితోడు దిగుబడులను తీవ్రంగా దెబ్బతీసే బొబ్బర తెగుళ్లు కూడా ఆశిస్తున్నాయి. నివారణ కోసం రైతులు మందులు పిచికారీ చేస్తున్నారు.
లంచం కోసం చందాలు
కలిశెట్టి చిన్నా, కౌలురైతు, కేతిముక్కల అగ్రహారం
ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో ముందస్తుగా ఎకరాకు రూ.15 వేలు కౌలు చెల్లించి మూడెకరాల్లో మిర్చి వేశాను. నీటి ఎద్దడి రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఇటీవల కాల్వలకు విడుదల చేసిన నీటితో ఒక తడైనా పొలాలకు పెడదామని కాల్వ తూము వద్దకు వెళ్తే లస్కర్‌ రూ.10 వేలు అడిగారు. రైతులందరం చండాలేసుకుని ఆ డబ్బులిచ్చాం. అయినా నీరు పొలం వరకు వచ్చినా పొలంలోకి రాలేదు. దీంతో ట్యాంకర్‌ ద్వారా పెట్టుకుంటున్నాం.
అరెకరానికే రూ.45 వేలు ఖర్చు
గడ్డిపర్తి ఏసుబాబు, రైతు, కె.ఎం.అగ్రహారం.
నాకున్న అరెకరంలో మిర్చి సాగు చేస్తే ఇప్పటికే రూ.45 వేల వరకు ఖర్చయింది. పొలానికి నీరందక ఆకు ముడత పడుతోంది. పంటపై ఆశలు సన్నగిల్లాయి. మా పక్క పొలాల రైతులందరం కలిసి రూ.లక్ష వరకు చందాలేసుకుని 2 కిలోమీటర్ల పైపులు కొనుగోలు చేసి చెరువు నీటిని పెట్టుకుంటున్నాం. అయినా ఈ నీరు కూడా చాలడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.