Nov 27,2022 22:34

ప్రజాశక్తి - గంపలగూడెం :

మండలంలోని మిర్చి రైతులు గత ఏడాదిలోలాగా నష్టపోక ముందే ప్రభుత్వ అధికారులు సలహాలు సూచనలు ఇవ్వాలని ఎన్టీఆర్‌ జిల్లా రైతు సంఘం కార్యదర్శి పివి ఆంజనేయులు కోరారు. ఆదివారం ఆయన గంపలగూడెం మండలం పెనుగొలను, దుందిరాలపాడు, ఊటుకూరు, తునికిపాడు తదితర గ్రామాలలో మిర్చి పంటలను పరిశీలించారు. మిర్చి పంటలో తామర పురుగు ఆశిస్తున్నట్లు గమనిం చినట్లు తెలిపారు. ఇటువంటి విషయాలపై గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం ఆంజనేయులు గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ శాస్త్రవేత్తలు పంట పొలాలను పరిశీలించి, రైతులకు తగిన జాగ్రత్తలు సూచనలు చేయాలని, తగిన సమయంలో ఏ మందు ఎలా వాడాలో తెలియజేసినట్లయితే రైతులు జాగ్రత్త పడే అవకాశం ఉందని వివరించారు. మండలంలోని హార్టికల్చర్‌, అగ్రికల్చరల్‌ వ్యవసాయ అధికారులు సంయుక్తంగా రైతులకు తగిన సలహాలు ఇవ్వాలని కోరారు. గ్రామస్థాయిలో ఉన్న ఆర్బికేల ఉద్యోగులైన ఎంపీఈవోలు క్షేత్రస్థాయిలో మిర్చి చేలను పరిశీలించి తగిన సలహాలు రైతులకు తెలియజేయాలన్నారు. జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షులు గువ్వల సీతారామిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారని, పంట చేతికి వస్తుందన్న సమయం ఆసన్నమైందని ఇప్పుడే రైతులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ సత్యం బాబు, ఎం జె చారి, మహిళా సంఘం నాయకురాలు తేళ్లూరు శాంతకుమారి, దేవర నాగార్జున, వి ఆంజనేయులు, పి పుల్లారావు, జయరాజు పాల్గొన్నారు