Jan 17,2023 22:42

తెగుళ్లతో నాసిరంగా ఉన్న మిరప పంట

- వరదల వల్ల ఆలస్యంగా సాగు
- తెల్ల, నల్ల తామర తెగుళ్ల దాడితో నష్టం
ప్రజాశక్తి-కూనవరం

పోలవరం ముంపు మండలాలలో మిర్చి పంట రైతు కళ్లలో మంట తెప్పిస్తున్నాయి. వదరల వల్ల పంట సాగు ఆలస్యం కాగా, తెల్ల, నల్ల తామర తెగుళ్లు ఉన్న పంటను నాశనం చేస్తున్నాయి. ముంపు మండలాల్లో అత్యధికంగా వేసే పంటలలో మిర్చి ఒకటి. ఇప్పుడు ఈ పంట వేయాలంటే రైతులు భయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ఈ ఏడాది వరదలు ఎక్కువైన నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వేయాల్సిన పంటలు రెండు నెలలు ఆలస్యంగా అక్టోబర్‌ నుండి నవంబర్‌ నెలల్లో వేయడం జరిగింది. మొదట మిర్చి నారు పోసిన సమయంలోనే భారీగా వరదలు రావడంతో ఆ నారు ముంపునకు గురై పాడైపోయింది. వరదలు తగ్గిన తరువాత మళ్లీ నారు పోసి పంట ఆలస్యంగా వేశారు. దీనికి తోడు రెండేళ్లగా తెల్ల తామర, నల్ల తామర తెగుళ్లు పంటపై దాడి చేయడంతో దిగుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. మిర్చి ధర ఒక క్వింటా రూ.18వేలు నుండి రూ.20వేలు వరకు ఉంది. అయితే పంట ఆలస్యంగా వేయడం, తామర తెగుళ్ల ప్రభావం దిగుబడిపై ఉంటుందని, నష్టం వాటిల్లనుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో ఉన్న ఖరీదైన మందులను పిచికారీ చేస్తున్నామని, అయినా తామర తెగులు పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వరదలు, తెగుళ్లు కారణంగా ఈ ఏడాది మిర్చి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు.