ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: ఈ ఏడాది ఇంకొల్లు మండలంలో మిర్చి, శనగ పంటలను రైతులు అధికంగా సాగు చేశారు. మిర్చి 80 శాతం కోతలు పూర్తయి కల్లాలో ఆరబెట్టారు. శనగ పంట 90 శాతం కోతలు పూర్తయి పంట ఇంటికి చేరింది. ఈ నెలాఖరుకు పంట మొత్తం పూర్తిగా రైతుల ఇంటికి వచ్చేస్తుంది. అప్పు సప్పు చేసి సాగు చేసిన పంట ఇంటికి వస్తుందన్న ఆనందంలో ఉన్న రైతులకు అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావటం, మేఘాలు నల్లగా మారటంతో మిర్చి రైతుల గుండెల్లో దడ మొదలైంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన మిర్చి పంట కోతలు కోసి కల్లాల్లో ఆరబెట్టారు. గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులను చూసి రైతుల గుండెల్లో బండరాయి పడినట్లయింది. గురువారం కొద్దిపాటి చినుకులు కూడా పడటంతో పరదాలు తీసుకొని కల్లాల్లోకి రైతులు పరుగులు తీస్తున్నారు. కారుమబ్బులు కల్లాల్లో కప్పివేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు శనగ రైతులు కోతలు పూర్తి కాలేదు. చేతికి వచ్చే శనగ చివరి అంకంలో ఉంది. ముందు నాడు వేసిన పంట నూర్పిళ్లు పూర్తయి పంట ఇంటికి చేరింది. వర్షాలకు దెబ్బతిన్న పంటను తిరిగి విత్తటంతో ఆ పంట చేతికి రావాల్సి ఉంది. ఇంకొల్లు, కొణికి, గంగవరం, దుద్దుకూరు ప్రాంతాల్లో శనగ కోతలు ఇంకా కోయాల్సి ఉంది. దీంతో శనగ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. మేఘాలు కమ్మి మిర్చి, శనగ రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.










